- మెరుగ్గా క్యాంపస్ నియామకాలు
- ఇంజినీరింగ్, టెక్నికల్, ఏఐ ప్రొఫైల్స్‌కి డిమాండ్
- ప్రథమార్ధంపై ఎడెకో ఇండియా నివేదిక
కొన్నాళ్లుగా దేశీ ఐటీ రంగంలో నియామకాలు నెమ్మదించినప్పటికీ కాస్త కుదురుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఫ్రెషర్లు, మిడ్-సీనియర్ స్థాయి నిపుణుల రిక్రూట్‌మెంట్ రూపంలో నియామకాల ధోరణులు మెరుగుపడినట్లు హెచ్‌ఆర్ సొల్యూషన్స్ సంస్థ ఎడెకో ఇండియా ఒక నివేదికలో తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే క్యాంపస్ నియామకాలు 25 శాతం మేర పెరిగినట్లు ఎడెకో ఇండియా డైరెక్టర్ సంకేత్ చెంగప్ప తెలిపారు. అలాగే, ఐటీ దిగ్గజాలు కీలకమైన ఇంజినీరింగ్, టెక్నికల్ సంస్థలతో హైరింగ్‌పై మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. ఇంజినీరింగ్, టెక్నికల్, ఏఐ ఉద్యోగాలకు డిమాండ్ 27 శాతం పెరిగింది. వేతన స్థాయులు కూడా 5 శాతం మేర పెరిగాయి. రెండో త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు, ఉద్యోగులకు నెలకొన్న డిమాండ్‌ను బట్టి ఈ నివేదిక రూపొందింది.
మరిన్ని విశేషాలు..
➤చాలా వరకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ హైదరాబాద్, బెంగళూరు, పుణె, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో జరుగుతోంది. విశాఖ, కోయంబత్తూర్, ఉదయ్‌పూర్, నాగ్‌పూర్‌లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్లేస్‌మెంట్‌లు 7 శాతం పెరిగాయి.
➤బెంచ్‌కే పరిమితం చేయకుండా ఫ్రెషర్ల నుంచి కూడా ఉత్పాదకత రాబట్టే విధమైన హైరింగ్‌కి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముందు రిక్రూట్ చేసుకుని, తర్వాత శిక్షణనిచ్చే సంప్రదాయానికి భిన్నంగా, ముందుగానే క్యాంపస్‌లను సంప్రదించడం ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత నియమించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి.
➤ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్‌సెక్యూరిటీ, క్రాస్–డొమైన్ ఇంజినీర్స్, ఎంఆల్‌ఆప్స్ ఇంజినీర్స్, డేటా ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో డిమాండ్–సరఫరా మధ్య 45–50 శాతం మేర వ్యత్యాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ, డిమాండ్‌కి తగ్గట్లుగా హైరింగ్ చేపట్టడానికి మొగ్గు చూపుతున్నాయి.
➤కంపెనీలు పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకోవడం కాకుండా, నైపుణ్యాలకే పెద్ద పీట వేస్తు న్నా యి. క్లౌడ్, డేటా, ఏఐ సామర్థ్యాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. క్యాంపస్ హైరింగ్ క్రమంగా పెరుగుతున్నప్పటికీ, మార్కెట్‌కి అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాలున్న వారు దొరకడం ప్రధాన సవాలుగా ఉంటోంది.
➤భారీ టీమ్‌ల కన్నా అత్యంత ప్రభావవంతంగా, సత్ఫలితాలను చూపగలిగే చిన్న బృందాలను ఏర్పాటు చేసుకోవడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. కుదుర్చుకోబోయే డీల్స్, డెలివరీ లక్ష్యాల ఆధారంగా మాత్రమే వేరే సంస్థల నుంచి నిపుణులను నియమించుకుంటున్నాయి.
➤ఎడెకో గణాంకాల ప్రకారం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డెలివరీ లీడర్‌షిప్ ఉద్యోగాలకు సంబంధించి మిడ్–సీనియర్ స్థాయి ఉద్యోగుల రిక్రూట్‌మెంట్ 42 శాతం పెరిగింది. మూడో త్రైమాసికంలో ఐటీ హైరింగ్ జోరు 45 శాతం స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ మార్గదర్శకాలు.. పేటిఎం ఆఫ్‌లైన్ బిజినెస్ బదిలీ!


