పైన చెప్పినది 2022–23 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించినది. చెప్పాలంటే 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విషయం. పరాభవ నామ సంవత్సరం ప్రారంభంలోనే ఇన్‌కం ట్యాక్స్ డిఫాల్టర్లకు డిపార్ట్‌మెంట్ వారు షాకిచ్చారు. షాక్ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందయ్యా అంటే..
2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను రిస్క్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీ సైకిల్ 6ని ఫాలో అవుతున్నారు. సాధారణంగా రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఆరు అంశాలు ఉంటాయి. అవేంటంటే..
🔸 రిస్క్‌ని గుర్తించడం
🔸 వాటి విశ్లేషణ
🔸 నిర్ధారణ
🔸 తగిన చర్యలు తీసుకోవడం
🔸 పర్యవేక్షణ
🔸 నివేదిక
ఇంచుమించు ఇదే పంథాలో డిపార్ట్‌మెంట్ తమ పంజా విసురుతోంది. డిపార్ట్‌మెంట్ వారి నిర్వహణ నిమిత్తం అంటు 2026 మార్చి 23న ఒక అంతర్గత సూచన అంటూ జారీ చేశారు. విషయం ఏమిటంటే, 2021–22 ఆర్థిక సంవత్సరం.. అంటే 2022–23 అసెస్‌మెంట్ సంవత్సరంలో జరిగిన పెద్ద వ్యవహారాలను బైటికి తీసి (అలాగని .. వార్తాపత్రికల్లో ప్రచురించరు), వాటిని విశ్లేషించి, అసలు రిటర్నులు వేయనివారిని, అంటే, నాన్–ఫైలర్స్‌ని గుర్తించి, వారి మీద చట్టరీత్యా చర్యలు చేపడతారు.
ఎలా గుర్తిస్తారు?
ఆర్థిక వ్యవహారాల పట్టికలు. ప్రతి సంవత్సరం స్థిరాస్తి క్రయవిక్రయాలు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో పెట్టుబడులు మొదలైన వాటికి సంబంధించి వాటి నిర్వాహక సంస్థల నుంచి డిపార్ట్‌మెంట్ వారికి సమాచారం చేరిపోతుంది. వార్షిక సమాచార రిటర్న్ ద్వారా ఇది జరుగుతుంది.
టీడీఎస్ సర్టిఫికెట్లు. ప్రతి డిడక్టర్ టీడీఎస్ మొత్తాన్ని రికవర్ చేసి, సకాలంలో గవర్నమెంట్ ఖజానాకి చెల్లించాలి. ఆ మేరకు సరి్టఫికెట్లు 16 లేదా 16ఏ జారీ చేయాలి. అంతే కాకుండా వాటికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయాలి. వీటిలో మీకు చేసిన చెల్లింపుల వివరాలన్నీ సమగ్రంగా ఉంటాయి.
టీడీఎస్‌లాగానే, టీసీఎస్‌పరంగా మీ సంబంధిత సమాచారం ఉంటుంది.
జీఎస్‌టీ రికార్డులు
ఎగుమతులు–దిగుమతులు. కస్టమ్స్ అధికారి వద్ద రికార్డులు, షిప్‌మెంట్ రికార్డులు, హెచ్‌ఎస్‌ఈ కోడ్‌లు, వాళ్ల పేర్లు, టర్నోవర్ వివరాలు, విలువ.. ఈ సమాచారం అంతా ఉంటుంది.
ట్యాక్స్ పేయర్స్ ప్రొఫైల్స్
మీ ఆర్థిక వ్యవహారాల చిట్టా
ఆస్తులు.. అప్పులు
ఎవరితో ఏయే వ్యవహారాలు జరిపారు.
థర్డ్ పార్టీతో వ్యవహారాలు
ఇలాంటి వివరాలన్నీ సేకరించి మీ రిటర్న్ ప్రొఫైల్, ఆర్థిక సమాచారపు ప్రొఫైల్, వ్యక్తిగత సమాచారపు ప్రొఫైల్, అకౌంట్స్, ఆస్తుల ప్రొఫైల్, ఎవరితో సంబంధం ఉందో ఆ ప్రొఫైల్, ఇతర ఏజెన్సీల ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ తర్వాత వారి దగ్గర నుండి సమాచారం అందుకోని వారి జాబితా, అందుకుని కూడా రెస్పాన్స్ ఇవ్వని వారి జాబితాలు తయారు చేసి, అందులోని నాన్–ఫైలర్స్‌ని బైటికి తీస్తారు. ఆ తర్వాత నోటీసులు.. ప్రక్రియ మొదలు.
ఈ మేరకు దిశ, సూచనలు, సలహాలు, ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు రిటర్నులు అనవసరమైతే, వారిని వదిలేస్తారు. రిటర్నులు వేయాల్సి ఉన్నా, వేయని డిఫాల్టర్స్‌ని మాత్రం వదలరు. ‘ఇన్‌కం – ఎస్కేప్డ్‘ కింద భావించి, కథ నడుపుతారు.
ఈ రోజు 2021–22 మొదలు, త్వరలోనే ఆ తర్వాత సంవత్సరాల వ్యవహారాల మీదా నిఘా ఇలాగే ఉంటుంది. తగిన జాగ్రత్త వహించండి. అందాకా కథ పోనివ్వకండి. అప్‌డేటెడ్ రిటర్న్స్ వేసుకునే అవకాశం ఉన్న కాగితాలతో వృత్తి నిపుణులను సంప్రదించండి.
ఈ సందర్భంలో మహాభారతంలో తిక్కన రాసిన పద్యం గుర్తుంచుకోండి ‘వచ్చిన వాడు ఫల్గుణుడు. అవశ్యము గెల్తుమనంగ రాదు‘ అని. దాని అర్థం ఏమిటంటే, ఆ వచ్చిన వాడు అర్జునుడు.. యుద్ధం చేస్తే గెలుస్తామనే నమ్మకం లేదు.. మనం సిద్ధంగా ఉండాలి. దేనికైనా ఓర్చుకోవాలి. సంధి చేసుకోవడం మంచిదని భావం.
మనకు అన్వయించుకుంటే.. ఆ వచ్చేవాళ్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. విస్తృత అధికారాలతో పాటు సమాచారంతో వస్తారు. సరైన తోవలో నడుచుకోవడం శ్రేయస్కరం.


