
ఈ వారం సెక్షన్ 80లో పొందుపర్చిన అంశాలు... వైద్యానికి సంబంధించిన మినహాయింపులు గురించి తెలుసుకుందాం. ముఖ్య విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా కేవలం పాత పద్ధతిని అనుసరించిన వారికే మాత్రమే వర్తిస్తాయి.
80డీ – మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం
ఈ సెక్షన్ వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి తన కోసం, జీవిత భాగస్వామి కోసం తన మీద ఆధారపడ్డ పిల్లల కోసం చెల్లించే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 పరిమితిని మించి మినహాయింపు ఇవ్వరు. తల్లిదండ్రులు 60 సంవత్సరాల లోపు వారయితే అదనంగా రూ.25,000 వారి నిమిత్తం చెల్లించే ప్రీమియంలపై, మొత్తం మీద రూ.50,000 మినహాయింపు ఇస్తారు. కుటుంబంలో ఏ వ్యక్తి చెల్లిస్తాడో... ఆ వ్యక్తి ఇన్‌కంలోంచి మినహాయింపు ఇస్తారు. ఇతరులకు ఇవ్వరు. నగదులో చెల్లించిన ప్రీమియంలకు మినహాయింపు దొరకదు. చెక్కు ద్వారా, డీడీ ద్వారా ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
వ్యక్తి, అతని తల్లిదండ్రులు.. అందరూ 60 సంవత్సరాల్లోపు ఉంటే మొత్తం రూ.50వేలు, వ్యక్తి 60 సంవత్సరాల్లోపు ఉండి, తల్లిదండ్రులు అరవై ఏళ్లు దాటిన వారు అయితే రూ.25,000 కాకుండా అదనంగా రూ.50,000 దాకా మినహాయింపు ఇస్తారు. వ్యక్తి, తల్లిదండ్రులు 60 ఏళ్లు దాటితే రూ.50వేలు + 50వేలు = మొత్తం రూ. 1,00,000 ఇస్తారు. ఇవన్నీ కాకుండా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ నిమిత్తం రూ.50 వేలు ఖర్చు పెట్టొచ్చు. ఈ మేరకు నగదు చెల్లించవచ్చు. కానీ ఖర్చు మొత్తం గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది.
రెండో అంశం 80డీడీ
ఒక వ్యక్తి మీద ఆధారపడ్డ మనిషి దివ్యాంగుడైతే, అతని వైద్యం నిమిత్తం చేసిన ఖర్చులకు మినహాయింపు ఉంది. ఈ అంగవైకల్యాన్ని శాతాల్లో చెప్పాలంటే ... 40% లోపల ఉంటే రూ.75,000; 80 శాతానికిపైన ఉంటే రూ.1.25 లక్షల మినహాయింపు ఉంటుంది. వైద్య ఖర్చులే కాకుండా, ఈ వ్యక్తుల మీద చేసిన జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు కూడా వర్తిస్తుంది. వైద్య ఖర్చులు, నర్సింగ్, పునరావాస నిమిత్తం మొదలైనవి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. మానసిక, చెవుడు, బుద్ధి మాంద్యం, మస్తిష్క పక్షవాతం, ఆటిజం, గుడ్డితనం, చూపుతక్కువ, లోకోమోటర్ వైకల్యం (అవయవాలు లేదా శరీరభాగాలు కదలికలకు సంబంధించింది) కుష్టు వ్యాధి మొదలైన వాటికి మినహాయింపు ఉంది. ఫారం 101ఏ జతపరచాలి. వైద్య అధికారులు సర్టిఫై చేయాలి.
ఇది కాకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంగవైకల్యం మారుతూ ఉంటుంది. తేడాలు వస్తాయి. సర్టిఫికెట్లలో ధృవీకరించిన శాతాన్ని బట్టే మినహాయింపు ఉంటుంది. దివ్యాంగుడు ముందుగా మరణిస్తే, స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని, ఏ వ్యక్తి అకౌంటులోకి వస్తుందో, ఆ వ్యక్తి ఆదాయంలో కలుపుతారు. దివ్యాంగుడు జీవించి ఉన్నప్పుడు, 60 సంవత్సరాలు తర్వాత వచ్చే యాన్యుటీకి మినహాయింపు ఉంది. ఈ సెక్షన్‌లో మినహాయింపును తీసుకున్న వ్యక్తి, ఈ ప్రయోజనాన్ని సెక్షన్ 80యూ ప్రకారం పొందకూడదు.
80 డీడీబీ
దీని ప్రకారం వ్యక్తి తన కోసం లేదా తన మీద ఆధారపడిన వ్యక్తి నిర్దేశిత జబ్బుల చికిత్సకు అయిన ఖర్చు క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి రూ.40 వేలు (60 ఏళ్ల లోపల) రూ.1,00,000 సీనియర్ సిటిజన్లకు తగ్గిస్తారు. 11 డీడీ రూల్ ప్రకారం క్లెయిమ్ చెయ్యాలి. న్యూరాలజిస్ట్, అంకాలజిస్ట్, యూరాలాజిస్ట్, హెమొటాలాజిస్ట్, ఇమ్యూనోలాజిస్ట్, మొదలైన స్పెషలిస్టులు ధృవీకరించాలి. పూర్తి వివరాలు ఇవ్వాలి. సంతకం కచ్చితంగా ఉండాలి. అసెస్సీతో సంబంధం లేకుండా పేషెంటు వయస్సుని బట్టి మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు రూ.1 లక్ష దాకా, ఇతరులకు రూ.40,000 ఇస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినట్లయితే ఆ విలువ మేరకు మినహాయిపు తగ్గుతుంది.
చివరిగా మరొకటి.. 80యూ
దీని ప్రకారం మినహాయింపు. మెడికల్ ఆధారిటీతో సర్టిఫై చేయిస్తే అంగవైకల్యం 40% దాటి ఉంటే రూ.75 వేలు, 80% దాటి ఉంటే రూ.1.25 లక్షల మినహాయింపు ఇస్తారు. ఫారం 101ఏ ఫైల్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్‌లోని సివిల్ సర్జన్లు/ చీఫ్ మెడికల్ అధికారి సర్టిఫై చేయాలి. అంగవైకల్యం సర్టిఫికెట్ కొత్తది జతపర్చాలి. అంధత్వం, కుష్టు, చెవుడు, మానసిక వైకల్యం, మానసిక మాంద్యం... వీటి విషయంలోనే ఇస్తారు. డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు.
చివరగా హెచ్చరిక ఏమిటంటే.. సరైన ధృవపత్రాలుండాలి. నకిలీ డాక్టర్లు, నకిలీ పత్రాలు వద్దు. అన్నింటికి రికార్డు స్పష్టంగా ఉండాలి.
