
ఈ సెక్షన్ 80Cలో సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు, ఖర్చులు ఇలా ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్‌కు పదేళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు గరిష్ట పరిమితి రూ.1,00,000 ఉండేది. తరువాత రూ.1.50 లక్షలకి పెంచారు. అనంతరం ఎటువంటి మార్పులేదు. ఎప్పుటికప్పుడు ఈ పరిమితిని పెంచుతారని వదంతులు, పుకార్లు, ఎదురుచూపులు.. కానీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఈ లక్షన్నర లిమిట్ ప్రస్తుతానికి అక్కడే ఆగిపోయింది. కారణం ఏమిటంటే ఈ సెక్షన్ పాత పద్ధతిలో పన్ను భారాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే. కొత్త విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.
పాతవిధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే 80C లో ఉన్న ఆప్షన్లు వర్తిస్తాయి. అవేమిటంటే ...
🔸 తన పేరు మీద, జీవిత భాగస్వామి .. పిల్లల పేర్ల మీద చెల్లించే జీవిత బీమా
🔸 డిఫర్డ్ యాన్యుటీ కోసం చేసిన చెల్లింపులు
🔸 ఈపీఎఫ్/జీపీఎఫ్/ సూపర్ యాన్యుయేషన్ ఫండ్‌కి చెల్లింపులు
🔸 సుకన్య సమృద్ధి అకౌంటులో డిపాజిట్లు
🔸 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో VIII, IX ఇష్యూలు
🔸 అయిదేళ్ల పైబడి కాలవ్యవధి కలిగిన డిపాజిట్లలో ఇన్వెస్ట్‌మెంట్లు
🔸 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమలు
🔸 సీనియర్ సిటిజన్స్ స్కీము 2024లో పెట్టుబడులు
🔸 యూటీఐ యూలిప్ పాలసీ 1971కి జమలు, ఎల్‌ఐసీ జమలు
🔸 ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్‌కి జమలు
🔸 ఎల్‌ఐసీ యాన్యుటీ ప్లాన్/ ఇతర సంస్థల యాన్యుటీ ప్లాన్, కొత్త జీవన్‌ధార, కొత్త జీవన్ అక్షయ ఐఐ, ఐఐఐ ప్లాన్లు, జీవన్‌ధార అక్షయ
🔸 యూటీఐ స్కీం 1992/1999/2005కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్
🔸 నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) వారికి చేసిన చెల్లింపులు
🔸 బ్యాంకు/ఎల్‌ఐసీ/ఎన్‌హెచ్‌బీ/ ఇతర కంపెనీల నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులు
🔸 పిల్లల స్కూల్ ఫీజు చెల్లింపులు (ఇద్దరికి మాత్రమే)
🔸 ఈక్విటీ షేర్లు/డిబెంచర్ల కోసం చెల్లింపులు
🔸 షెడ్యూల్డ్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో అయిదేళ్ల కాలవ్యవధితో చేసిన డిపాజిట్లు
🔸 నాబార్డు వారు జారీ చేసిన బాండ్ల కొనుగోళ్లు
🔸 ఇన్యూరెన్స్ పాలసీ (డిఫర్డ్ యాన్యుటీ పాలసీ మినహా)
🔸 ఇంటి రిజిస్టేషన్ కోసం చెల్లించే రిజిస్టేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ చెల్లింపులు.
ఇలా సెక్షన్ 80Cలో 20 అంశాలు ప్రతిపాదించారు. వీటిలో కొన్నింటికి షరతులు విధించారు. షరతులకు లోబడితేనే ఆయా అంశాల ప్రకారం మినహాయింపు ఇస్తారు.
ఇతరత్రా విషయాలు..
🔸 ప్రావిడెండ్ ఫండ్‌కి చేసే చెల్లింపులు, లోన్ రీపేమెంట్లకు ఎటువంటి మినహాయింపు రాదు.
🔸 ఇంటి రిజిస్ట్రేషన్ విషయంలో వాటా కోసం చెల్లింపు, డిపాజిట్, ఇంటికి మార్పులు, రెనోవేషన్, రిపేరు ఖర్చులకు మినహాయింపు ఇవ్వరు.
🔸 ట్యూషన్ ఫీజుకే మినహాయింపులు. డెవలప్‌మెంట్, డొనేషన్స్ నిమిత్తం చెల్లించినందుకు మినహాయింపులు ఇవ్వరు.
🔸 లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల మీద ఆంక్షలున్నాయి. ఏడాది చెల్లింపులు సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం దాటకూడదు.
🔸 సుకన్య సమృద్ధి అకౌంటు డిపాజిట్ల మీద వడ్డీ మినహాయింపు ఉంది.

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.