ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌కు జీఎస్‌టీ విభాగం నుంచి నోటీసులు అందాయి. ముంబై ఈస్ట్ కమిషనరేట్‌కు చెందిన సీజీఎస్‌టీ, సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఏకంగా రూ.769 కోట్ల డిమాండ్ నోటీసులను జారీ చేశారు.
డిమాండ్ మొత్తం రూ.384,33,53,972 (సుమారు రూ.384 కోట్లు)గా ఉన్నా పెనాల్టీ రూపంలో పన్ను మొత్తంతో పాటు దానికి సమానమైన జరిమానా, వడ్డీని కూడా చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. దాంతో మొత్తంగా రూ.769 కోట్లు అయింది. మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 లోని సెక్షన్ 74 ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.
వివాదం నేపథ్యం ఏమిటి?
సాధారణంగా బ్యాంకులు తమ వినియోగదారుల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల సేవలను ఉచితంగా అందిస్తుంటాయి. అయితే, ఈ ఉచిత సేవలకు కూడా ప్రతిఫలం ఉంటుందని, దానిపై పన్ను చెల్లించాలని జీఎస్‌టీ విభాగం వాదిస్తోంది. ఈ అంశంపై గతంలో కూడా షోకాజ్ నోటీసులు అందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ‘గతంలోనూ ఇలాంటి అంశాలపై బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోంది. అయితే ప్రస్తుత డిమాండ్ మొత్తం పరిమితిని మించి ఉన్నందున నిబంధనల ప్రకారం దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదిస్తున్నాం’ అని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది.
తదుపరి కార్యాచరణ
ఈ నోటీసులపై ఐసీఐసీఐ బ్యాంక్ వెనక్కి తగ్గడం లేదు. నిర్ణీత గడువులోగా రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదా అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించడం ద్వారా ఈ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం బ్యాంక్ ఆర్థిక వ్యవహారంపై పెద్దగా ప్రభావం చూపకపోయినా చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


