లక్ష్మీదేవి తలుపు తట్టిందా అన్నట్లు.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి అనుకోకుండా కోటీశ్వరుడైపోయాడు. అయితే.. తేరుకునేలోపే వచ్చిన డబ్బు మొత్తం వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన వినోద్ డోంగిల్ నోటరీ, ప్రైవేట్ స్కూల్ ఓనర్ కూడా. ఈయన ఎప్పటిలాగే ఉదయం తన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తరువాత ఖాతాలో డబ్బును చూసి.. ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈయన ఖాతాలో ఏకంగా రూ. 2,817 కోట్లు కనిపించాయి. హర్సిల్ ఆగ్రో లిమిటెడ్కు చెందిన 1,312 షేర్లు ఉన్నట్లు, ఒక్కో షేరు విలువ రూ. 2.14 కోట్లకంటే ఎక్కువ అని తెలుసుకున్నాడు. దీంతో ఇతడు బిలినీయర్ అయిపోయాడు.
రాత్రికి రాత్రే నా విధి మారిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లాటరీ గెలిచినట్లు అనిపించిందని వినోద్ డోంగిల్ పేర్కొన్నారు. కానీ అదృష్టం వచ్చినంత వేగంగా.. దురదృష్టం కూడా వచ్చింది. నిమిషాల్లోనే ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు వెనక్కిపోయింది. ఖాతా సాధారణ స్థితికి చేరుకుంది.
ఇదీ చదవండి: కియోసాకి ఆందోళన: జాగ్రత్త పడండి!
వినోద్ డోంగిల్ ఖాతాలోకి అంత డబ్బు రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు. బహుశా సిస్టమ్ లోపాలు, టెక్నికల్ సమస్య లేదా స్టాక్ మార్కెట్ డేటాబేస్‌లలో డేటా అసమతుల్యత కారణంగా ఇది జారీ ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి డోంగిల్ కొన్ని సెకన్ల పాటు బిలినీయర్ అయ్యారు. దీన్ని డిజిటల్ బిలినీయర్ అని నిపుణులు అభివర్ణించారు.


