
పేదవారికైనా, ధనవంతులకైనా సొంతంగా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కల. ఆ కల కోసం చాలా కష్టాలు పడి డబ్బు పోగు చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవాలనుకోవడం మంచి ఆలోచనే.. కానీ ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి స్థలం ఎంపిక చేసుకోవాలి?, దానికి అయ్యే బడ్జెట్ ఎంత అనేదానికి సంబంధించిన విషయాలపై కూడా ఓ అవగాహన ఉండాలి.
ఇల్లు కట్టుకోవడానికి.. ఓ మంచి స్థలం ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇల్లు ఒక్కసారే ఇష్టపడి కట్టుకుంటారు. కాబట్టి మీ జీవనశైలికి తగిన విధంగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. అందుబాటులో ఉన్న వనరుల గురించి తెలుసుకుని స్థలం ఎంచుకోవాలి.

స్థలం ఎంచుకోవడానికి ముందు గమనించాల్సిన విషయాలు
చేతిలో డబ్బు ఉంది, ఇల్లు కట్టుకుంటాం.. అనుకుంటే సరిపోదు. ఆలా అని తక్కువ ధరలో.. ఎక్కడో మారుమూల ప్రాంతంలో స్థలం కొని ఇల్లు కట్టుకున్నా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కొనే స్థలానికి దగ్గరలో.. స్కూల్, హాస్పిటల్, మార్కెట్స్, రవాణా సదుపాయాలు మొదలైనవి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
స్వచ్ఛమైన వాతావరణం ఉండే ప్రదేశంలో ఇల్లు కట్టుకుంటే.. ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి శబ్దాలు లేకుండా.. స్వచ్ఛమైన గాలి అందుబాటులో వుండే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడం మంచిది. మీరు ఉన్న ప్రాంతంలో సెక్యూరిటీ ఉందా?, లేదా? అనేది కూడా ముందుగానే పరిశీలించాలి.

ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఎంచుకోవడానికి ముందు.. అది భూకంప ప్రభావానికి గురైన ప్రాంతమా?, వరదలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా?, అనే విషయాలతో పాటు.. మంచినీటి వసతి, డ్రైనేజీ సదుపాయాలు మొదలైనవి ఉన్నాయా? లేదా అని ముందుగానే తెలుసుకోవాలి.
బడ్జెట్
ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనుగోలు చేయాలనుకున్నప్పుడే.. ఎంత బడ్జెట్ కేటాయించాలి అనే ప్రశ్న తెలెత్తుతుంది. స్థలం కోసమే ఎక్కువ డబ్బు వెచ్చిస్తే.. ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేసి.. దాన్ని తీర్చడానికి మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని, ప్రణాళికను దెబ్బతీస్తుంది.

ఉదాహరణకు.. ఇంటి స్థలం కోసం రూ.10 లక్షలు కేటాయించాలి అని ప్లాన్ వేసుకున్నప్పుడు, ఆ బడ్జెట్లో లభించే స్థలం కోసం వేచి చూడాలి. మీ బడ్జెట్‌కు స్థలం లభించిన తరువాత ముందడుగు వేయాలి. ఇక్కడ కూడా మీకు కావలసిన సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి.
ఇదీ చదవండి: ఇంటి కోసం ల్యాండ్ కొనేముందు చూడాల్సినవి..
ప్రస్తుతం స్థలాల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ధరలు నగరాల్లో ఒకలా.. నగరాలకు కొంత దూరంలో ఇంకోలా ఉన్నాయి. ఈ విషయాలను ముందుగా తెలుసుకోవాలి. దీనికి నిపుణుల సలహాలు తీసుకోవాలి. కొంతమంది మధ్యవర్తులు మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇల్లు కట్టుకోవడం అంటే.. గోడలు కట్టి, పైకప్పు వేసుకోవడం కాదు, అది మనసుకు నచ్చేలా.. ప్రశాంతతను ఇచ్చేలా ఉండాలి. ఇది మొత్తం మీ ఎంపిక మీదనే ఆధారపడి ఉంటుందనే విషయం మాత్రం మరచిపోకూడదు.