ఇప్పటి వరకు ఇదే అత్యధికం..రికార్డ్‌ స్థాయిలో వెహికల్స్‌ అమ్మకాలు

Highest Ever Automobile Sales Recorded In November 2022 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్‌లో వాహన అమ్మకాలు నవంబరులో 23,80,465 యూనిట్లు నమోదయ్యాయి. 2021 నవంబర్‌తో పోలిస్తే 26 శాతం అధికం. అంతేగాక భారత వాహన పరిశ్రమలో ఈ స్థాయి విక్రయాలు జరగడం ఇదే తొలిసారి అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. ‘బీఎస్‌–4 నుంచి బీఎస్‌–6 ప్రమాణాలకు మళ్లిన నేపథ్యంలో 2020 మార్చిలో జరిగిన అత్యధిక అమ్మకాలను మినహాయించాలి. పండుగల సీజన్‌ ముగిసినప్పటికీ పెళ్లిళ్ల కారణంగా గత నెలలో విక్రయాల జోరు కొనసాగింది.  

విభాగాలవారీగా ఇలా.. 
గతేడాది నవంబర్‌తో పోలిస్తే ప్యాసింజర్‌ వెహికిల్స్‌ గత నెలలో 21 శాతం వృద్ధితో 3 లక్షల మార్కును దాటాయి. కార్ల లభ్యత, కొత్త మోడళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పెరగడం ఈ వృద్ధికి కారణం. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ, ఎస్‌యూవీల జోరు కొనసాగింది. టూ వీలర్లు 24 శాతం అధికమై 18,47,708 యూనిట్లకు చేరుకున్నాయి. త్రిచక్ర వాహనాలు 81 శాతం, ట్రాక్టర్లు 57 శాతం పెరిగాయి. వాణిజ్య వాహనాలు 33 శాతం దూసుకెళ్లి 79,369 యూనిట్లుగా ఉంది. మౌలిక రంగంపై ప్రభుత్వం దృష్టిసారించడం, కొత్త మైనింగ్‌ ప్రాజెక్టుల రాక, పాత వాహనాల స్థానంలో కొత్తవి చేరికతో కమర్షియల్‌ విభాగం మెరుగ్గా ఉంది.  

డిస్కౌంట్లు సైతం.. 
చాలా కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. మరోవైపు స్టాక్‌ క్లియర్‌ చేసుకోవడానికి బేసిక్‌ వేరియంట్లతోపాటు కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. రెపో రేటు పెరగడంతో కస్టమర్లపై రుణ భారం పెరిగి ద్విచక్ర వాహనాలు, ఎంట్రీ లెవెల్‌ ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా లాక్‌డౌన్‌ కారణంగా సెమికండక్టర్ల సరఫరా మందగించే చాన్స్‌ ఉంది. ఇదే జరిగితే విక్రయాల స్పీడ్‌కు బ్రేకులు పడతాయి. తద్వారా డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండదు’ అని ఫెడరేషన్‌ తెలిపింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top