భారతీయులకు శుభవార్త!, ఇకపై అమెరికాలోనే హెచ్‌1బీ వీసా రెన్యూవల్‌!

H-1b Visas : Usa To Start Domestic Work Visa Renewal - Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. హెచ్‌-1బీ వీసా రెన్యూవల్‌ కోసం దేశం వచ్చే అవసరం లేకుండా అక్కడే ఉండి వీసా రెన్యూవల్‌ చేసుకునే అవకాశాన్ని బైడెన్‌ ప్రభుత్వం కల్పించనుంది.  
  
కొన్ని కేటగిరీల హెచ్‌-1బీ వీసాలను దేశీయంగానే (అమెరికాలో ఉండి) రెన్యువల్‌ చేసుకునేలా ఓ పైలట్‌ ప్రోగ్రామ్‌ను డిసెంబర్‌ నెలలో ప్రారంభించనుంది. తద్వారా అమెరికాలో ఉంటున్న ఎక్కువ మంది భారత ఐటీ నిపుణులకు లబ్ధి చేకూరనున్నట్లు యూఎస్‌ అధికారులు చెబుతున్నారు. 

ఈ సందర్భంగా వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జూలీ స్టఫ్‌ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో యూఎస్ వీసాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అమెరికా వీసా కావాలంటే సుమారు ఆరు నెలల లేదంటే ఏడాది పాటు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇకపై అలా ఎదురు చూసే అవసరం లేకుండా ప్రణాళికల్ని సిద్ధం చేశాం. 

ఇందులో భాగంగా అమెరికాలో ఉంటూ యూఎస్‌ వీసా రెన్యూవల్‌ కోసం ఎదురు చూస్తున్న విదేశీయుల (అందులో భారతీయులు కూడా ఉన్నారు) కోసం ప్రత్యేకంగా డొమెస్టిక్‌ వీసా రెన్యూవల్‌ ప్రోగ్రామ్‌ను త్వరలో ప్రారంభించనున్నాం. డిసెంబర్‌లో ప్రారంభించబోయే వీసా రెన్యూవల్‌ పైలెట్‌ ప్రోగ్రామ్‌లో సుమారు 20వేల వీసాల్ని రెన్యూవల్‌ చేసే అవకాశం కల్పించనున్నాం. ఈ ప్రాజెక్ట్‌తో అమెరికాలో నివసిస్తున్న ఎక్కువ మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుంది. దశల వారీగా వీసా రెన్యూవల్‌ సంఖ్యను మరింత పెంచుతాం’’ అని జూలీ స్టఫ్‌ అన్నారు.  

20 ఏళ్ల క్రితం
అమెరికాలో నివసిస్తున్న నిపుణుల్లో భారతీయులే ఎక్కువ. అయితే ఈ నిపుణులకు స్థానిక కంపెనీలు హెచ్‌-బీ వీసాను అందిస్తుంటాయి.రెన్యూవల్‌ సైతం అక్కడే ఉండి చేసుకోవచ్చు. ఈ వీసా రెన్యూవల్‌ ప్రాసెస్‌ 2004 వరకు ఉండేది. అయితే క్రమంగా వీసా నిబంధనలు మారాయి. అలా అమెరికాలో ఉంటున్న భారతీయులు వీసా రెన్యూవల్‌ కోసం భారత్‌ వచ్చి వీసా రెన్యూవల్‌ చేయించుకుని తిరిగి వెళ్లే వారు. కానీ భారత ప్రధాని మోదీ ఈ ఏడాది జూన్ 21 నుంచి 24 వరకు చేసిన అమెరికా పర్యటనతో వీసా జారీలలో అనేక మార్పులు చేస్తూ వచ్చింది. తాజాగా 20 ఏళ్ల తర్వాత అమెరికాలోనే ఉండి హెచ్‌-1 బీ వీసాలను అక్కడే ఉండి రెన్యూవల్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌  నిర్ణయం తీసుకున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top