60 రోజులకు సరిపడా ముడి చమురు సిద్ధం | Govt Confirms Fuel LPG Supply Safe No Shortage Across India | Sakshi
Sakshi News home page

త్వరలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ

Mar 27 2026 8:01 AM | Updated on Mar 27 2026 8:01 AM

Govt Confirms Fuel LPG Supply Safe No Shortage Across India

ఇంధన నిల్వలు పుష్కలం

తప్పుడు ప్రచారాలపై కేంద్రం సీరియస్

దేశంలో ఇంధన సరఫరాపై సాగుతున్న వదంతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. భారత్‌లో పెట్రోలియం, ఎల్‌పీజీ సరఫరా పూర్తిగా సురక్షితంగా, నియంత్రణలో ఉందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని భరోసా ఇచ్చింది.

వదంతులు నమ్మొద్దు..

సోషల్ మీడియాలో ఇంధన కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల్లోని క్యూలైన్లు, పాత లాక్‌డౌన్ దృశ్యాలను వాడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్చరించింది. ఇటువంటి వార్తలను నమ్మి పౌరులు ఆందోళన చెందవద్దని, ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని పేర్కొంది.

కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురును కంపెనీలు ఇప్పటికే సేకరించాయి. రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా పెట్రోల్ బంకులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి 8,00,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ సరుకు సముద్ర మార్గంలో భారత్‌కు వస్తోంది. భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ ఇంధన భద్రతలో పటిష్టంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకప్పుడు కేవలం పశ్చిమాసియాపైనే ఆధారపడిన భారత్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 41కి పైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల హార్మూజ్‌ జలసంధి వంటి ప్రాంతాల్లో అంతరాయాలు కలిగినా దేశీయ సరఫరాకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేసింది.

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

నిత్యావసర వస్తువుల లభ్యతపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం హెచ్చరించింది. ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, డీలర్లకు క్రెడిట్ పరిమితులను కూడా పెంచామని, కావున ప్రజలు సంయమనం పాటించాలని కోరింది.

ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement