కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది. 5% ఉన్న దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది మే 13 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం వల్ల విలువైన లోహాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాప్స్, క్లాంప్స్, పిన్లు, స్క్రూ బ్యాక్స్ వంటి వాటిపైనా సుంకాలు పెరిగాయి. బంగారం, వెండి ఫైండింగ్స్‌పై 5% కస్టమ్స్ సుంకం, ప్లాటినం ఫైండింగ్స్‌పై 5.4% సుంకం విధించారు.
అదే సమయంలో, రీసైక్లింగ్, విలువైన లోహాల రికవరీకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగించిన ఉత్ప్రేరకాలు, బూడిదతో కూడిన విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని 4.35%కి తగ్గించారు. అయితే ఇందుకు నిర్దిష్ట నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాలి.
భారత్ ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 24% పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 9 శాతంగా ఉంది. ఇక బంగారం సరఫరాలో స్విట్జర్‌ల్యాండ్ 40% వాటాతో మొదటి స్థానంలో ఉండగా, యూఏఈ 16%, దక్షిణాఫ్రికా దాదాపు 10% వాటాతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.


