
బంగారం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు జూన్‌లో బలమైన డిమాండ్ కనిపించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవలి కాలంలో స్థిరమైన ర్యాలీ చేస్తుండడం ఇన్వెస్టర్లను మరింతంగా ఆకర్షిస్తోంది. జూన్ నెలలో ఏకంగా రూ.2,081 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.
ఈ ఏడాది మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.292 కోట్లతో పోల్చి చూస్తే జూన్‌లో ఏడింతలైనట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రూ.6 కోట్లు, మార్చిలో రూ.77 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ కాలాన్ని పరిశీలించి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.8,000 కోట్లుగా ఉన్నాయి.
ఈ ఏడాది జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.3,751 కోట్లను ఆకర్షించగా, ఆ తర్వాత తిరిగి జూన్‌లోనే గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం గమనించొచ్చు. జూన్‌లో రెండు గోల్డ్ ఈటీఎఫ్‌లు మొదటిసారి మార్కెట్లోకి వచ్చి (ఎన్‌ఎఫ్‌వోలు) ఇన్వెస్టర్ల నుంచి రూ.41 కోట్లను సమీకరించాయి. జూన్ చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల విలువ మే చివరితో పోల్చి చూసినప్పుడు 4%పెరిగి (మే చివరి నుంచి) రూ.64,777 కోట్లకు చేరింది.
స్థిరమైన ధరలు, అనిశ్చిత పరిస్థితులు..
‘‘జూన్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి బలమైన పెట్టుబడులు రావడం సెంటిమెంట్‌లో మార్పునకు నిదర్శనం. ధరలు స్థిరంగా ఉండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఈక్విటీ, డెట్ సాధనాల్లో అస్థిరతలు ఇందుకు కారణమై ఉండొచ్చు’’అని మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ తెలిపారు. కొత్త పథకాల ద్వారా నిధుల సమీకరణ కూడా మెరుగ్గానే ఉన్నట్టు చెప్పారు.
గోల్డ్ ఈటీఎఫ్‌ల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లకు సంబంధించి ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) జూన్‌లో 2.85 లక్షలు పెరిగాయి. మొత్తం ఫోలియోలు 76.54 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ధరలు బంగారం మార్కెట్ ధరలనే ప్రతిఫలిస్తుంటాయి. ఒక ఈటీఎఫ్ యూనిట్ గ్రాము బంగారంతో సమానం. కానీ, కొన్ని ఫండ్స్ సంస్థలు ఇంతకంటే తక్కువ పరిమాణంలోనూ పెట్టుబడులకు అనుమతిస్తున్నాయి.