కృత్రిమ మేధ(AI) వేగంగా అభివృద్ధి చెందడం మొదలైనప్పటి నుంచి ఉద్యోగాల కోత సంచలనంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వాటి కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తూ వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ గాడ్ ఫాదర్‌గా పిలువబడే జెఫ్రీ హింటన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐలో వస్తున్న మార్పు భవిష్యత్తులో కోట్లాది మందిని నిరుద్యోగులుగా మారుస్తుందని, ఈలోగా కేవలం ఎలాన్ మస్క్ వంటి కొద్దిమంది మాత్రమే ధనవంతులు అవుతారని జోస్యం చెప్పారు.
కంపెనీల వైఖరి
ఇప్పటికే టెక్ దిగ్గజాలైన ఐబీఎం, టీసీఎస్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు ఏఐని అమలు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఈ ధోరణి ఇప్పట్లో ఆగిపోయే అవకాశం లేదని హింటన్ బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోకుండా ఏఐతో ముందుకు వెళ్లే మార్గం ఉందా అని అడిగినప్పుడు ‘అది సాధ్యం కాదని నమ్ముతున్నాను. డబ్బు సంపాదించాలంటే మానవ శ్రమను భర్తీ చేయాలి. అందుకు ఏఐను వాడుతున్నారు. కంపెనీలు లాభాలు పెంచుకునేందుకు ఈ పంథాను వినియోగిస్తున్నాయి’ అన్నారు.
ఏఐ సమస్య కాదు.. సామాజిక సమస్య..
ఏఐ అభివృద్ధి వల్ల ఏర్పడే ఆర్థిక అసమానతపై జెఫ్రీ హింటన్ మాట్లాడుతూ.. ‘టెక్ బిలియనీర్లు మాత్రమే ఈ రేసులో విజేతలుగా నిలుస్తారు. గణనీయ సంఖ్యలో ఉద్యోగుల స్థానంగా ఏఐ పని చేస్తుంది. మస్క్ వంటి వ్యక్తులు మాత్రమే ధనవంతులు అవుతారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. ఇది ఏఐ సమస్య కాదు, సామాజిక సమస్య. ఏఐ మన సమాజాన్ని, మన ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మిస్తుందనేది నిశితంగా గమనించాలి’ అన్నారు.
ఇదీ చదవండి: ఏఐ బూమ్ ఎఫెక్ట్: ఫ్లాష్ మెమరీ కాంపోనెంట్ల కొరత


