ప్రధానంగా పశ్చిమాసియాలో కొనసాగనున్న పరిస్థితులు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకానికీ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వెరసి ఈ వారం భారీ ఆటుపోట్ల మధ్య మార్కెట్లు ట్రేడ్‌కానున్నట్లు అంచనా వేశారు. వివరాలు చూద్దాం..
కొద్ది వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణంపై ఇన్వెస్టర్లు మరింత దృష్టి పెట్టనున్నారు. ప్రధానంగా యూఎస్, ఇరాన్ మధ్య పరిస్థితులు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరే వీలున్న వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఆశావహ పరిస్థితులు కనిపించినప్పటికీ ఇటీవల తిరిగి ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరగవచ్చని నిపుణులు విశ్లేషించారు. దీంతో గత మూడు వారాలుగా హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఇకపైనా తీవ్ర ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు అంచనా వేశారు.
గణాంకాలపై ఫోకస్
12న ఏప్రిల్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), 14న టోకు ధరల వివరాలు(డబ్ల్యూపీఐ) వెల్లడికానున్నాయి. మార్చిలో సీపీఐ 3.2% నుంచి 3.4%కి పెరిగింది. డబ్ల్యూపీఐ మరింత అధికంగా 2.13% నుంచి 3.88 శాతానికి ఎగసింది. దీంతో ఆర్‌బీఐ భవిష్యత్ పరపతి విధానాలపై ధరలు ప్రభావం చూపనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీనికితోడు పశ్చిమాసియాలో మళ్లీ ఆందోళనలు పెరుగుతుండటంతో ముడిచమురు ధరలు బ్యారల్ 100 డాలర్ల సమీపంలో కదులుతున్నాయి. ఫలితంగా డాలరుతో మారకంలో రూపాయి 95 స్థాయికి బలహీనపడిన సంగతి తెలిసిందే.
కాగా.. ఈ నెల 15న ఏప్రిల్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. మార్చిలో వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరోపక్క చైనా, యూఎస్.. ద్రవ్యోల్బణం, ఉపాధి, వాణిజ్యం తదితర గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఈ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, ఎన్‌రిచ్ మనీ సీఈవో ఆర్. పొన్మూడి, స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా వివరించారు. అయితే యూఎస్, ఇరాన్ మధ్య ఆశావహ పరిస్థితులు నెలకొంటే చమురు ధరలు దిగివచ్చే వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వగలదని అభిప్రాయపడ్డారు.
క్యూ4 జాబితాలో
ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న 2025–26 చివరి త్రైమాసిక (క్యూ4) ఫలితాల సీజన్‌లో భాగంగా మరికొన్ని దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. ఫలితాలు ప్రకటించనున్న జాబితాలో కెనరా బ్యాంక్, టాటా పవర్, ఎయిర్‌టెల్, డీఎల్‌ఎఫ్, హెచ్‌పీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండియన్ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్ తదితరాలున్నాయి.
హెచ్చు తగ్గుల మధ్య గత వారం మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ 415 పాయింట్లు(0.53 శాతం), నిఫ్టీ 179 పాయింట్లు(0.75 శాతం) చొప్పున ఎగశాయి. వెరసి 77,328 వద్ద, 24,176 వద్ద ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 3.4 శాతం, 4.3 శాతం చొప్పున జంప్‌చేయడం గమనార్హం!
ఈ వారం సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలుంది. కొద్ది వారాలుగా నిఫ్టీ 23,600–24,700 పాయింట్ల శ్రేణిలో కన్సాలిడేట్ అవుతోంది. ఈ శ్రేణి నుంచి బయటపడితే అంటే 23,600 దిగువన 23,100–23,000 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఇలాకాకుండా బలపడి 24,700 పాయింట్లను దాటితే 25,000ను తాకవచ్చు.


