టెక్‌ స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు తగ్గాయ్‌.. | Funding for Indian Tech Startups Declines by 18pc in FY25 | Sakshi
Sakshi News home page

టెక్‌ స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు తగ్గాయ్‌..

Apr 10 2026 2:29 PM | Updated on Apr 10 2026 2:32 PM

Funding for Indian Tech Startups Declines by 18pc in FY25

న్యూఢిల్లీ: దేశీ టెక్నాలజీ అంకుర సంస్థల నిధుల సమీకరణ గత ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 14.3 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 18 శాతం క్షీణించింది. అయితే, 2023–24లో సమీకరించిన 9.7 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే పెరిగింది. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ’ట్రాక్షన్‌’ ఇండియా టెక్‌ వార్షిక ఫండింగ్‌ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా నిధులను దక్కించుకున్న స్టార్టప్‌లపరంగా అంతర్జాతీయంగా అమెరికా, బ్రిటన్, చైనా తర్వాత భారత్‌ నాలుగో స్థానంలో నిల్చింది. జర్మనీ, ఫ్రాన్స్‌కన్నా ముందుంది. తాజా గణాంకాల ప్రకారం సీడ్‌ స్థాయి స్టార్టప్‌లలో పెట్టుబడులు 1.5 బిలియన్‌ డాలర్ల నుంచి 15 శాతం క్షీణించి 1.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. వ్యాపారాలను విస్తరించే ప్రణాళికల్లో ఉన్న ఎర్లీ స్టేజ్‌ అంకురాల్లోకి ఫండింగ్‌ 3.6 బిలియన్‌ డాలర్ల నుంచి 33 శాతం ఎగిసి 4.8 డాలర్లకు పెరిగింది. లేట్‌ స్టేజ్‌ స్టార్టప్‌లకు నిధులు 9.2 బిలియన్‌ డాలర్ల నుంచి 38 శాతం క్షీణించి 5.6 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి.  

నివేదికలో మరిన్ని వివరాలు.. 

  • 2025–26లో 100 మిలియన్‌ డాలర్ల పైబడిన ఫండింగ్‌ లావాదేవీలు 13 నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 23గా, 2023–24లో 13గా నమోదయ్యాయి. నిధులను ఆకర్షించడంలో ఫిన్‌టెక్, రిటైల్‌ టాప్‌ రంగాలుగా నిల్చాయి.  

  •     ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్స్, ఫిన్‌టెక్‌ కంపెనీలకు భారీ స్థాయిలో నిధులను లభించాయి. నెక్స్‌ట్రాలోకి 710 మిలియన్‌ డాలర్ల పీఈ పెట్టుబడులు, నెయిసాలోకి 600 మిలియన్‌ డాలర్లు, ఐనాక్స్‌ క్లీన్‌ ఎనర్జీలోకి 344 మిలియన్‌ డాలర్లు వచ్చాయి.  

  •     ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్స్‌లోకి దాదాపు అంతక్రితం ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే 3.6 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. ఫిన్‌టెక్‌ సంస్థలు 14 శాతం అధికంగా 2.4 బిలియన్‌ డాలర్లు దక్కించుకున్నాయి.  

  •     రిటైల్‌ స్టార్టప్‌లలోకి పెట్టుబడులు 32 శాతం క్షీణించి 3.5 బిలియన్‌ డాలర్ల నుంచి 2.4 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.  

  •     ఐపీవోలపరంగా టెక్‌ సంస్థల ఇష్యూలు 52 శాతం పెరిగి 47కి చేరాయి. లెన్స్‌కార్ట్, గ్రో, మీషోలాంటి బడా ఐపీవోలు వీటిలో ఉన్నాయి. 2024–25లో 4 అంకురాలు యూనికార్న్‌ హోదా (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌) దక్కించుకోగా, 2025–26లో ఇది 50 శాతం పెరిగి 6 స్టార్టప్‌లకు చేరింది. 

Advertisement
 
Advertisement
Advertisement