ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు హెచ్చరిక.. నటుడి షాకింగ్ అనుభవం! | FASTag Scam You Should Be Aware Of Munna Bhai Actor Shares On Instagram | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు హెచ్చరిక.. నటుడి షాకింగ్ అనుభవం!

Jun 1 2026 4:18 PM | Updated on Jun 1 2026 5:09 PM

FASTag Scam You Should Be Aware Of Munna Bhai Actor Shares On Instagram

ప్రముఖ నటుడు అశ్విన్ ముష్రాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వాహనదారులలో చర్చకు దారితీసింది. ఈ సంఘటన ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) వ్యవస్థలో జరిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసింది.

అశ్విన్ ముష్రాన్ ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్‌ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, టోల్ ప్లాజా వద్ద ఒక సమస్య ఎదురైంది. టోల్ సిబ్బంది తన ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేదని చెప్పారు. దీంతో తనకు రూ.200 జరిమానా విధించి, చెల్లించాలని కోరారు. అయితే.. జరిమానా చెల్లించిన తరువాత, తన ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను చెక్ చేసుకుంటే, అందులో దాదాపు రూ.3,000 బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.

అశ్విన్ ముష్రాన్ వెంటనే.. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తిరుగు ప్రయాణంలో అదే వాహనం అదే టోల్ ప్లాజా గుండా ఎటువంటి సమస్య లేకుండా వెళ్లింది. అనంతరం తన ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌కు సంబంధించిన ఆధారాలను చూపించి టోల్ సూపర్వైజర్‌తో మాట్లాడారు. చివరికి సంబంధిత అధికారులు తనకు 200 రూపాయలు తిరిగి చెల్లించినట్లు పేర్కొన్నారు.

ఈ సంఘటనకు కారణం సాంకేతిక లోపమా?, లేక మోసానికి సంబంధించినదా? అనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేసింది.

ఫాస్ట్‌ట్యాగ్ మోసాల పట్ల జాగ్రత్తలు

  • ప్రయాణానికి ముందు ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. అవసరమైతే స్క్రీన్‌షాట్ తీసుకోవాలి.

  • బ్యాలెన్స్ లేదని చెబితే వెంటనే అదనపు చెల్లింపు చేయకుండా, ఖాతా వివరాలను మరోసారి ధృవీకరించమని అడగాలి.

  • ప్రతి టోల్ చెల్లింపు తర్వాత వచ్చిన SMS లేదా యాప్ నోటిఫికేషన్‌ను పరిశీలించడం మంచిది.

  • అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే సంబంధిత టోల్ అధికారులకు లేదా ఫాస్ట్‌ట్యాగ్ కస్టమర్ కేర్‌కు వెంటనే ఫిర్యాదు చేయాలి.

అశ్విన్ ముష్రాన్ వీడియో వైరల్ అయిన తర్వాత.. చాలామంది నెటిజన్లు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. ఒక్కోసారి రూ.200 చిన్న మొత్తంగా కనిపించినా, వేలాది వాహనాల వద్ద ఇలాంటి ఘటనలు జరిగితే అది పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. కాబట్టి ఫాస్‌ట్యాగ్ ఉపయోగించే ప్రతి వాహనదారులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement