Vadilal Chairman Success Story: 9వ తరగతి ఫెయిలైనా రూ.1900 కోట్ల కంపెనీకి ఓనర్‌..

failed in 9th class now runs Rs 1843 crore company as chairman Success Story - Sakshi

రాజేష్ గాంధీ (Rajesh Gandhi).. వాడిలాల్ ఇండస్ట్రీస్ (Vadilal Industries) చైర్మన్. 1979లో కంపెనీలో చేరిన నాలుగో తరం వ్యాపారవేత్త. తన ఆధ్వర్యంలో 90వ దశకంలో వాడిలాల్ కోల్డ్-చైన్ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తూ ప్రాసెసెడ్‌ ఆహార పరిశ్రమలోకి ప్రవేశించింది. చదువే అన్నింటికీ పరమార్థం కాదు. చదువులో వెనుకబడినవారు కూడా తమదైన రంగంలో అద్భుత విజయాలు సాధించగలరని చెప్పడానికి రాజేష్‌ గాంధీ ఒక ఉదాహరణ.

ఈ ప్రముఖ ఐస్ క్రీం కంపెనీని 1907లో వాడిలాల్ గాంధీ స్థాపించారు. ఇది అహ్మదాబాద్‌లోని ఒక చిన్న వీధి సోడా దుకాణంతో ప్రారంభమైంది. 2023 సెప్టెంబర్ 18 నాటికి వాడిలాల్‌ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,843 కోట్లుగా ఉంది.

9వ తరగతి ఫెయిల్‌ 
రాజేష్‌ గాంధీ తన పాఠశాల విద్యను అహ్మదాబాద్‌లోని సెయింట్ జేవియర్స్ హై స్కూల్‌లో చదివారు. అయితే తాను 9వ తరగతిలో ఫెయిల్ అయ్యానని ఒకసారి ఫార్చ్యూన్ ఇండియాతో మాట్లాడుతూ రాజేష్‌ గాంధీ చెప్పారు. ఆ స్కూల్‌లో ఫెయిలైన తాను బయటకు వెళ్లి మరో స్కూల్‌లో 10వ తరగతిలో చేరాలనుకోగా దానికి తన తండ్రి ఒప్పుకోలేదని, పట్టుబట్టి మరీ తనను ఆ స్కూల్‌లోనే మరో సంవత్సరం 9వ తరగతి చదివించాడని గుర్తు చేసుకున్నారు.

వాడిలాల్ కంపెనీ పలు ఫ్లేవర్లతో కోన్‌లు, క్యాండీలు, బార్‌లు, కప్పులు, ఫ్యామిలీ ప్యాక్‌లతో సహా అనేక రూపాల్లో ఐస్‌క్రీంను తయారు చేస్తోంది. కంపెనీ సూపర్ మార్కెట్లు కాకుండా దాని ఫ్రాంఛైజ్ ఆధారిత హ్యాపిన్నెజ్ ఐస్ క్రీం పార్లర్ల ద్వారా రిటైల్ అమ్మకాలు సాగిస్తోంది. 1990వ దశకంలో బాగా స్థిరపడిన కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌ని ఉపయోగించి ప్రాసెస్డ్ ఫుడ్స్ పరిశ్రమలోకి ప్రవేశించిన వాడిలాల్ కంపెనీ తమ వ్యాపారాన్ని మరింత విస్తరించింది.

1972-73 వరకు అహ్మదాబాద్‌లో వాడిలాల్‌ కంపెనీకి 8 నుంచి 10 అవుట్‌లెట్‌లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత క్రమంగా గుజరాత్‌లోని ఇతర ప్రాంతాలకు, 1985 నాటికి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలకు విస్తరించింది. నేడు వాడిలాల్ భారతదేశంలోని ప్రముఖ ఆహార, పానీయాల కంపెనీలలో ఒకటిగా నిలిచింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top