ఇంట్లో అందరికీ లేఆఫ్‌.. ఆరుగురి ఉద్యోగాలూ పోయాయ్‌.. | Everyone laid off Family financial crisis 6 members lose their jobs layoffs | Sakshi
Sakshi News home page

ఇంట్లో అందరికీ లేఆఫ్‌.. ఆరుగురి ఉద్యోగాలూ పోయాయ్‌..

May 28 2026 5:12 PM | Updated on May 28 2026 5:24 PM

Everyone laid off Family financial crisis 6 members lose their jobs layoffs

లేఆఫ్‌లకు సంబంధించి రోజుకో కొత్త వ్యథ వెలుగులోకి వస్తోంది. టెక్నాలజీ, ఫిన్‌టెక్‌, విమానయాన రంగాల్లో కొనసాగుతున్న ఉద్యోగ కోతల తీవ్రతను ప్రతిబింబించే ఓ కుటుంబ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, నలుగురు తోబుట్టువులు వరుసగా ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ప్రముఖ FAANG (మెటా, అమెజాన్‌, యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఆల్ఫాబెట్‌) కంపెనీల్లో పనిచేసినప్పటికీ గత ఏడాదిలో ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో ఒకరు ఏడాదికిపైగా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా, మరొకరు ఎలాంటి సెవరెన్స్‌ ప్యాకేజీ లేకుండానే తొలగింపునకు గురైనట్లు తెలిపాడు. మరో సోదరుడు ఫిన్‌టెక్‌ కంపెనీలో పనిచేసి గత ఆగస్టులో ఉద్యోగం కోల్పోగా, చిన్న సోదరి పనిచేసిన విమానయాన సంస్థ మూతపడటంతో ఆమె కూడా నిరుద్యోగిగా మారింది.

ఇప్పటికే కుటుంబ సభ్యుల్లో కొందరికి గృహ రుణాలు ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నా నెలసరి తనఖా చెల్లింపులకు సరిపడా ఆదాయం రావడం లేదని వారు చెబుతున్నారు. ఇద్దరు చిన్న తోబుట్టువులు అద్దె ఇళ్లు వదిలి తిరిగి తల్లిదండ్రుల వద్దకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు తాత్కాలిక పనులు చేసుకుంటూ ఖర్చులను తగ్గించుకోవాలని, అవసరమైతే ఒకే ఇంట్లో కలిసి నివసించాలని సూచించారు. కొందరు ఈ పరిస్థితిని 2008 ఆర్థిక మాంద్యంతో పోల్చగా, మరికొందరు ఏఐ ప్రభావంతో టెక్‌ రంగంలో ఉద్యోగ కోతలు మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

Posts from the recruitinghell
community on Reddit

Advertisement
 
Advertisement
Advertisement