
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు ఓ కొత్త అప్డేట్ వచ్చింది. ఏటీఎం నుంచి పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ సేవలను ఈపీఎఫ్ఓ 2026 జనవరి నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సీబీటీ, అక్టోబర్ రెండవ వారంలో జరగబోయే బోర్డు సమావేశంలో ఏటీఎం ఉపసంహరణలను ఆమోదించే అవకాశం ఉంది.
ఏటీఎం ఉపసంహరణ సౌకర్యం ఉద్యోగులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. పీఎఫ్ సొమ్ము ఉపసంహరించుకోవడానికి వారు ఆన్ లైన్ క్లెయిమ్ ను సమర్పించాల్సిన అవసరం ఉండదు. పీఎఫ్ డబ్బు కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఉద్యోగులు నేరుగా ఏటీఎంకు వెళ్లి పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏటీఎం లాంటి లావాదేవీలను అనుమతించడానికి సిద్ధంగా ఉందని సీబీటీ సభ్యుడిని ఉటంకిస్తూ మనీకంట్రోల్ వార్తా సంస్థ పేర్కొంది. ఏటీఎం ఉపసంహరణకు పరిమితి ఉంటుందని, అయితే దీనిపై ఇంకా చర్చ జరుగుతోందని ఆయన చెప్పనట్లుగా పేర్కొంది.
ఈపీఎఫ్ఓ ఏటీఎం సదుపాయాన్ని ప్రారంభించడంపై బ్యాంకులతో పాటు ఆర్బీఐతో చర్చించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు ప్రత్యేక కార్డును జారీ చేసే అవకాశం ఉందని, ఏటీఎంల నుండి తమ నిధులలో కొంత భాగాన్ని ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కాగా ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కింద 7.8 కోట్ల మంది రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి ఈపీఎఫ్వో దగ్గర రూ .28 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ చేశారు. దాదాపు పదేళ్ల క్రితం 2014లో ఈపీఎఫ్ఓలో సభ్యులు 3.3 కోట్ల మంది ఉండగా వారి డిపాజిట్ల మొత్తం రూ.7.4 లక్షల కోట్లుగా ఉండేది.