
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో టెక్ కంపెనీల అధిపతులకు, సీఈఓల బృందాలకు ఆతిథ్యం ఇచ్చారు. కానీ ఈ విందులో ట్రంప్ సన్నిహితుడు.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' మిస్ అయ్యారు. ఈ విందుకు ట్రంప్ మస్క్‌ను పిలవడం మరిచారా?, లేక పిలిచినా మస్క్ పట్టించుకోలేదా? అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ట్రంప్ విందుకు బిల్‌గేట్స్‌ను ఆహ్వానించారు, కానీ ఎలాన్ మస్క్‌ను పిలవలేదంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన మస్క్.. ''నన్ను ట్రంప్ విందుకు ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను హాజరు కాలేకపోయారు. నా ప్రతినిధి ఒకరు అక్కడ ఉన్నారు'' అని అన్నారు. కానీ ఈ కార్యక్రమానికి మస్క్.. ప్రతినిధి ఎవరైనా హాజరయ్యారా లేదా అనేది వెల్లడికాలేదు.
ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తరువాత.. కొంత కాలంపాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) అధిపతిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల దానికి రాజీనామా ఇచ్చారు. ఇటీవల ట్రంప్‌తో మస్క్ సంబంధాలను తెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.
I was invited, but unfortunately could not attend. A representative of mine will be there.
— Elon Musk (@elonmusk) September 4, 2025
ట్రంప్ విందుకు హాజరైన సీఈవోలు
ట్రంప్ విందుకు.. సుందర్ పిచాయ్ (గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ), సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ), వివేక్ రణదివే (టిబ్కో సాఫ్ట్‌వేర్ ఛైర్మన్), శ్యామ్ శంకర్ (పాలంటీర్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్), బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు), టిమ్ కుక్ (యాపిల్ సీఈఓ), మార్క్ జుకర్బర్గ్ (మెటా సీఈఓ), సెర్గీ బ్రిన్ (గూగుల్ సహ వ్యవస్థాపకుడు), సామ్ ఆల్ట్ మన్ (ఓపెన్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు), గ్రెగ్ బ్రోక్ మన్ (ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు), సఫ్రా కాట్జ్ (ఒరాకిల్ సీఈఓ), డేవిడ్ లింప్ (బ్లూ ఆరిజిన్ సీఈఓ), అలెగ్జాండర్ వాంగ్ (స్కేల్ ఏఐ సీఈఓ), జారెడ్ ఐజాక్ మన్ (షిఫ్ట్ 4 పేమెంట్స్ సీఈఓ) హాజరయ్యారు.