
ఓలా, ఊబర్ వంటి రైడ్-హెయిలింగ్ దిగ్గజాలతో పోటీపడేందుకు సర్కారు ట్యాక్సీలు రంగంలోకి దిగుతున్నాయి. ఎనిమిది ప్రముఖ భారతీయ సహకార సంస్థలు భారత్ టాక్సీ సర్వీస్‌ను 2025 చివరి నాటికి ప్రారంభించేందుకు చేతులు కలిపాయి. జూన్ 6న అధికారికంగా నమోదైన మల్టీ-స్టేట్ సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ రూ. 300 కోట్ల అధీకృత మూలధనంతో బలపడింది.
ఈ సంస్థలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC), ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO), గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF), కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD), నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB), నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) వంటి సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి.
ఈ సర్కారు ట్యాక్సీ సర్వీసు ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుండి 200 మంది డ్రైవర్లను చేర్చుకుంది. ప్రతి రాష్ట్రం నుండి 50 మంది డ్రైవర్లు ఉన్నారు. భారత్ టాక్సీ సర్వీస్ డ్రైవర్లకు మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు, ప్రయాణీకులకు తక్కువ ధరకు, సురక్షితమైన, నమ్మదగిన రవాణా సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సహకార మోడల్ ద్వారా డ్రైవర్లు సభ్యులుగా వ్యాపారంలో భాగస్వామ్యం కలిగి ఉంటారు. ఇది యాజమాన్య భావనను, సమాజ భావనను పెంపొందిస్తుంది.
త్వరలో ఒక టెక్నాలజీ భాగస్వామిని ఎంపిక చేసి, డిసెంబర్ 2025 నాటికి వినియోగదారులకు అనుకూలమైన రైడ్-హెయిలింగ్ యాప్‌ను ప్రారంభించనున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) బెంగళూరు, ఒక సలహాదారుతో కలిసి, భారత్ టాక్సీ సర్వీస్‌ను భారతదేశ మొబిలిటీ రంగంలో పోటీదారుగా నిలపడానికి బలమైన మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందిస్తోంది. సహకార నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు సభ్యత్వ డ్రైవ్‌లు కూడా జరుగుతున్నాయి.