
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ అంబానీని ‘ఫ్రాడ్’గా వర్గీకరించిన కొద్ది రోజుల్లోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ముంబైలోని కంపెనీకి సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అంబానీ వ్యక్తిగత నివాసం లేనప్పటికీ ఢిల్లీ, ముంబైలోని ఈడీ బృందాలు ఆయన గ్రూప్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీ నిర్వహించాయి. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై ఇప్పటికే నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ), బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు నియంత్రణ, ఆర్థిక సంస్థల నుంచి అందిన సమాచారం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన రెండు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ చర్యలు తీసుకుంది. విస్తృత దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా విచారిస్తున్నారు. ప్రజాధనాన్ని దారి మళ్లించారనేలా ఆధారాలు లభించాయని ఈడీ పేర్కొంది. ఈ ప్రక్రియలో బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ సంస్థలతో సహా అనేక సంస్థలను తప్పుదారి పట్టించి ఉండవచ్చని ఈడీ అభిప్రాయపడింది.
యస్ బ్యాంక్ రుణాలు
2017 నుంచి 2019 వరకు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు ఈడీ తెలిపింది.
ఇదీ చదవండి: ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు

ఫ్రాడ్‌గా వర్గీకరణ
రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ సంస్థ ప్రమోటర్ అనిల్ అంబానీని ‘మోసపూరితం(ఫ్రాడ్)’గా ఎస్‌బీఐ జూన్ 13న గుర్తించినట్టు ఇటీవల లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పకంజ్ చౌదరి తెలిపారు. జూన్ 24న ఆర్‌బీఐకి ఫ్రాడ్ వర్గీకరణ గురించి ఎస్‌బీఐ నివేదించిందని.. దీనిపై సీబీఐ వద్ద కేసు దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫ్రాడ్‌గా గుర్తించిన విషయాన్ని ఆర్‌కామ్ బీఎస్‌ఈకి జూలై 1న వెల్లడించడం గమనార్హం. ఆర్‌కామ్ ప్రస్తుతం దివాలా పరిష్కార చట్టం కింద చర్యలను ఎదుర్కొంటోంది. ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31వేల కోట్లకు పైగా రుణం తీసుకోగా.. ఈ నిధులను వివిధ గ్రూప్ సంస్థలకు మళ్లించినట్లు గుర్తించామని ఎస్‌బీఐ ఆర్‌కామ్‌కు తెలియజేయడం గమనార్హం. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఎస్‌బీఐ భారీగానే అప్పులు ఇచ్చింది. ఇందులో ఆగస్టు 26, 2016 నుంచి చెల్లించాల్సిన వడ్డీ, ఖర్చులతో కలిపి రూ.2,227.64 కోట్ల అసలు ఉంది. రూ.786.52 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీల ద్వారా నాన్ ఫండ్ బేస్డ్ రుణాలు కూడా ఉన్నాయి.