
యూనికార్న్‌ల లిస్టు నుంచి 4 స్టార్టప్‌లు ఔట్
జాబితాలో డ్రీమ్11, ఎంపీఎల్ మొదలైనవి
ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా నివేదికలో వెల్లడి
ముంబై: దేశీయంగా రియల్ మనీ గేమ్స్ (ఆర్‌ఎంజీ)పై నిషేధం విధించడంతో పలు అంకురాల వాల్యుయేషన్‌పై ప్రభావం చూపింది. నాలుగు బడా సంస్థలు .. యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే అంకురాలు) జాబితా నుంచి చోటు కోల్పోయాయి. డ్రీమ్11 (26 కోట్ల యూజర్లు) , గేమ్స్ 24 x 7 (12 కోట్ల యూజర్లు), గేమ్స్‌క్రాఫ్ట్ (3 కోట్ల యూజర్లు), మొబైల్ ప్రీమియర్ లీగ్ (9 కోట్ల యూజర్లు) వీటిలో ఉన్నాయి. ఇక యూనికార్న్‌లు కాకపోయినప్పటికీ ‘జూపీ’, ‘విన్‌జో గేమ్స్’లాంటి సంస్థల వాల్యుయేషన్లు కూడా పడిపోయాయి. ‘2025 ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్, ఫ్యూచర్ యూనికార్న్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఆన్‌లైన్ మనీ గేమ్స్‌ను నిషేధించే బిల్లును పార్లమెంటు గత నెల ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఆన్‌లైన్ మనీ గేమ్స్ సంబంధిత ప్రకటనలపై కూడా నిషేధం వర్తిస్తుంది. అలాంటి గేమ్స్ ఆడేందుకు నగదును బదిలీ చేసే సరీ్వసులను సైతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించకూడదు. ‘‘ఇలాంటి మార్పులన్నింటి వల్ల భారత్‌లో పేరొందిన పలు ఆర్‌ఎంజీ కంపెనీలపై ప్రభావం పడింది. దీనితో వాటి వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది’’ అని నివేదిక పేర్కొంది. అలాగే ఈ చట్టం వల్ల పరిశ్రమపై ఇన్వెస్టర్ల నమ్మకం కూడా సడలిందని వివరించింది. మరోవైపు, అంకురాలు క్రమంగా లాభదాయకత, పెట్టుబడులను సమర్ధంగా వినియోగించుకోవడం, దీర్ఘకాలంలో నిలకడగా ఉండే వ్యాపార విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ ఎండీ రాజేశ్ సలూజా తెలిపారు.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
→ 8.2 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో అత్యంత విలువైన భారతీయ స్టార్టప్‌గా డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థ జిరోధా అగ్రస్థానంలో ఉంది. చెరి 7.5 బిలియన్ డాలర్లతో ఫిన్‌టెక్ సంస్థ రేజర్‌పే, లెన్స్‌కార్ట్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
→ అత్యధికంగా 26 అంకురాలతో బెంగళూరు యూనికార్న్ హబ్‌గా నిల్చింది. వీటి మొత్తం వాల్యుయేషన్ 70 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 36.3 బిలియన్ డాలర్ల విలువ చేసే 12 స్టార్టప్‌లతో ఢిల్లీ–ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) రెండో స్థానంలో, 22.8 బిలియన్ డాలర్ల విలువ చేసే 11 సంస్థలతో ముంబై మూడో స్థానంలో నిల్చాయి.
→ దేశీయంగా అత్యంత పిన్న వయసు్కలైన యూనికార్న్ వ్యవస్థాపకులుగా జెప్టో ఫౌండర్లు కైవల్య ఓహ్రా, ఆదిత్ పలిచా (ఇద్దరికీ 22 ఏళ్లు) నిల్చారు.
→ వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఫిఫ్టీన్ పార్ట్‌నర్స్ భారతీయ స్టార్టప్స్‌లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసింది. టరి్టల్‌మింట్, వాట్‌ఫిక్స్, గ్రో, ప్రిజమ్ (ఓయో) సహా 68 అంకురాల్లో 200 మిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టింది. అత్యంత విలువైన స్టార్టప్‌లు ఏకంగా 3.74
లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. యూనికార్న్‌లలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 2.06 లక్షలుగా ఉంది.
11 కొత్త యూనికార్న్‌లు ..
కొన్ని ఆర్‌ఎంజీ కంపెనీలు లిస్టు నుంచి నిష్క్రమించినప్పటికీ ఈ ఏడాది యూనికార్న్‌ల జాబితాలోని స్టార్టప్‌ల సంఖ్య మొత్తం మీద పెరిగి, 73కి చేరింది. ఈ ఏడాది 11 అంకురాలు యూనికార్న్ హోదా దక్కించుకున్నాయి. ఏఐడాట్‌టెక్, నవీ టెక్నాలజీస్, వివృతి క్యాపిటల్, వెరిటాస్ ఫైనాన్స్, ర్యాపిడో, నెట్రాడైన్, జంబోటెయిల్, డార్విన్‌బాక్స్, మనీవ్యూ, జస్‌పే, డ్రూల్స్ వీటిలో ఉన్నాయి.