భవిష్యత్తులో రుణాలు పుట్టడం గగనమే
ఖాతాలపై మరింత తీవ్రం కానున్న బ్యాంకుల నజర్
కొత్తగా అమల్లోకి రాబోయే ఆర్‌బీఐ రూల్స్ ఎఫెక్ట్
ఆర్థిక క్రమశిక్షణకు, బ్యాంకింగ్ పటిష్టత కోసమే
బ్యాంకింగ్‌లో రుణాల స్వరూపం తీరుతెన్నులను సమూలంగా మార్చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. సమస్య వచ్చాకా పరిష్కారం వెతుక్కోవడం కన్నా అసలు సమస్యే రాకుండా బ్యాంకులు ముందు జాగ్రత్త తీసుకునేలా ఈసీఎల్ .. అంటే ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ విధానాన్ని ప్రతిపాదించింది. సరళంగా చెప్పాలంటే ఇచ్చిన రుణంపై నష్టం వచ్చే రిసు్కలను బ్యాంకులు ముందుగానే అంచనా వేసుకోగలగాలి. దానికి తగ్గట్లుగా ఆ మేరకు నిధులను పక్కన పెట్టుకోవాలి.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ రూల్స్‌తో రుణాల తీరుతెన్నులు మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. సరే అదేదో బ్యాంకులకు సంబంధించిన వ్యవహారం కదా మనకేంటి అనుకుంటే పొరపాటే. దీని వల్ల రుణాలు తీసుకున్న, తీసుకోబోతున్న వారందరిపైనా ప్రభావం పడబోతోంది. ఇంతకీ, అసలు ఈ రూలేంటి.. దాని ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయనేది వివరించేదే ఈ కథనం..
దశాబ్దాలుగా బ్యాంకులు తమకు ‘వాటిల్లిన నష్టం’ ప్రాతిపదికన మొండిబాకీలకు కేటాయింపులు చేసే విధానాన్ని పాటిస్తూ వస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే రుణ గ్రహీత తాను తీసుకున్న లోన్‌ని కొన్నాళ్ల పాటు చెల్లించక, అది బాకీగా మారితే గానీ దాన్ని మొండిపద్దు కింద వర్గీకరించడం లేదు. దాన్ని నష్టంగా పరిగణించి నిధులను పక్కన పెట్టడం లేదు. అంటే రుణ గ్రహీత విషయంలో కాస్త ఉదారంగా ఉంటున్నట్లే. ఎందుకంటే ఒకసారి మొండిపద్దుగా వర్గీకరిస్తే దాని వసూలుకు తీసుకునే చర్యలు వేరేగా ఉంటాయి. క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రభావమూ వేరేగా ఉంటుంది.
ఒకరకంగా ముందుగానే సదరు రుణం మొండిబాకీగా మారే అవకాశాలను అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవడం కన్నా, పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కొత్తగా వచ్చే ఈసీఎల్ నిబంధనలతో ఈ వేచి చూసే ధోరణికి కాలం చెల్లిపోతుంది. బ్యాంకులు ఇకపై రాబోయే రోజుల్లో రుణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకోవాల్సి రానుంది. తలెత్తబోయే రిసు్కలను ఊహించుకుని, ముందుగానే ప్రొవిజనింగ్‌తో సిద్ధంగా ఉండాలి. ఎప్పుడో తీరిగ్గా స్పందించడం కాకుండా, సింగిల్ పేమెంట్ మిస్ అయినా, వెంటనే స్పందించి, క్రియాశీలకంగా చర్యలు తీసుకోవాలి.
మరి దీని ప్రభావం ఏంటి..
ఇలా ఆర్‌బీఐ నిబంధనలను కఠినతరం చేసేయడమనేది మీ నెలవారీ ఖర్చులపైనా ప్రభావం చూపనుంది. రాబోయే నష్టాల రిసు్కలను అంచనా వేసి, వాటికి అనుగుణంగా బ్యాంకులు కొంత మొత్తాన్ని పక్కన పెట్టాల్సి రావడం వల్ల, వాటికి వ్యాపారం ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది. దీనితో మార్జిన్లను కాపాడుకునేందుకు అవి వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచాల్సి రావొచ్చు. ఫలితంగా మీరు కారు రుణం తీసుకోవాలన్నా.. పర్సనల్ లోన్‌లాంటివి తీసుకోవాలనుకున్నా వడ్డీ రేటు మరికాస్త పెరిగిపోవచ్చు.
కొత్త ప్రమాణాలు..
క్రెడిట్ స్కోరును పెద్దగా పట్టించుకోనివారికి ఈ కొత్త నిబంధనలు మేల్కొలుపులాంటివి. రుణం దొరకడమనేది కఠినతరమైన వ్యవహారంగా మారుతుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి క్రెడిట్ అలవాట్లను ట్రాక్ చేసేందుకు బ్యాంకులు మూడంచెల పర్యవేక్షణ విధానానికి మారతాయి. మొదటి అంచెలో, ఆరోగ్యకరమైన అకౌంట్లు ఉంటాయి. రెండో అంచెలో అప్పుడప్పుడే కాస్త స్ట్రెస్ మొదలవుతున్న దాఖలాలు కనిపించే ఖాతాలు ఉంటాయి. ఇక మూడో అంచెలో డిఫాల్ట్ అయిన ఖాతాలు ఉంటాయి. ఉదాహరణకు, మీరో రుణం తీసుకున్నారు. ఏదో కారణం వల్ల ఈఎంఐలను కట్టడంలో జాప్యం చేశారు.
ప్రస్తుతమైతే బ్యాంకులు కాస్త చూసీ చూడనట్లుగా పెనాలీ్టల్లాంటివి వేసి వదిలేస్తున్నాయే గానీ ఇకపై ఇలా జరిగితే మీరు వెంటనే హై రిస్క్ కేటగిరీలోకి వెళ్లిపోతారు. ఇచ్చిన రుణం రెండో గ్రేడ్‌లోకి జారిన పక్షంలో తమకి జరిమానా పడే అవకాశం ఉన్నందున, బ్యాంకులు ముందునుంచే చాలా జాగ్రత్త వహిస్తాయి. తీసుకున్నవారు రెగ్యులర్‌గా చెల్లించకపోతున్నా, క్రెడిట్ స్కోరు పడిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నా మరింత వేగంగా స్పందిస్తాయి. మీ మీద నిఘా మరింత పెంచేస్తాయి. అంటే రాబోయే రోజుల్లో రుణగ్రహీతలు ఏవో కొన్ని ఈఎంఐలు కట్టకపోతే మహా అయితే లేట్ ఫీజు పడుతుంది అంతేగా అనుకుని లైట్‌గా తీసుకునే పరిస్థితి ఉండదు. అసలుకే ఎసరొస్తుంది. ఖాతాలపై మానిటరింగ్ పెరగడమే కాకుండా భవిష్యత్తులో మీరు రుణం తీసుకుందామనుకున్నా అంత తేలిగ్గా దొరక్కపోవచ్చు.
వ్యవస్థకు మేలే..
వ్యక్తిగత స్థాయిలో రుణాలు తీసుకున్నవారికి ఈ నిబంధనలు కఠినతరంగా అనిపించినప్పటికీ ఒక క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా విస్తృత స్థాయిలో ఆర్థిక వ్యవస్థకు మేలే జరుగుతుంది. రాబోయే తలనొప్పులను ముందుగానే గుర్తించేలా బ్యాంకులపై ఒత్తిడి పెంచడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం పటిష్టంగా అయ్యేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భారీ బ్యాంకింగ్ సంక్షోభాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆర్థికంగా మందగమనాల్లాంటివేవైనా తలెత్తినా బ్యాంకులు ‘ఆరోగ్యకరంగా’నే ఉంటాయి. ఇక రుణాలు తీసుకున్న వారి విషయానికొస్తే.. క్రెడిట్ డిసిప్లిన్ అనేది సూపర్‌పవర్‌లాంటిది గుర్తెరిగి వ్యవహరించడం వల్ల రుణ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.
‘ఆరోగ్యకరంగా’నే ఉంటాయి. ఇక రుణాలు తీసుకున్న వారి విషయానికొస్తే.. క్రెడిట్ డిసిప్లిన్ అనేది సూపర్‌పవర్‌లాంటిది గుర్తెరిగి వ్యవహరించడం వల్ల రుణ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.
| అంశం | ప్రభావం |
|---|---|
| రుణ లభ్యత | కాస్త కఠినతరం |
| వడ్డీ రేట్లు | స్వల్పంగా పెరగొచ్చు |
| క్రెడిట్ డిసిప్లిన్ | ఇకపై మరింత కీలకం |
| బ్యాంకింగ్ | మరింత పటిష్టం |
ఏం చేయాలంటే..
- ఈఎంఐలు సకాలంలో చెల్లించేయాలి.
- క్రెడిట్ స్కోరు బాగుండేలా చూసుకోవాలి
- అతిగా రుణాలు తీసుకోవడం మానేయాలి


