యూఏఈలో ఇటీవల ఒక భారతీయ వ్యక్తి 100 మిలియన్ దిర్హమ్ల (రూ.240 కోట్లు) భారీ లాటరీని గెలుచుకున్నారు. ఇది విన్నవారందరూ ఆశ్చర్యచకితులై ఉంటారు. ‘వామ్మో అన్ని కోట్లు గెలిచాడా.. మరి దీనిపై ట్యాక్స్ కట్టాలా.. కడితే ఎంత కట్టాలి.. గెలిచిన లాటరీ సొమ్మును ఇండియాకు తెచ్చుకోవచ్చా?’ అందిరికీ వెంటనే ఇవే సందేహాలు వచ్చి ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం..
యూఏఈలో నో ట్యాక్స్
లాటరీ గెలిచింది అబుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల ప్రవాస భారతీయ యువకుడు అనిల్ కుమార్ బొల్లాగా గుర్తించారు. లాటరీ సొమ్ముపై ట్యాక్స్ అన్నది ఆయన ఎక్కడ పన్నులు చెల్లిస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ దేశంలో ఇప్పటివరకు గెలిచిన అతిపెద్ద జాక్ పాట్ ఇదే అయినప్పటికీ, అక్కడ అటువంటి లాటరీలపై స్థానిక యూఏఈ పన్నులేవీ ఉండవు. అంటే ఆయన మొత్తం డబ్బును యూఏఈలోని తన బ్యాంకు ఖాతాలో జమవుతుంది.
మరి భారత్లో..
భారతదేశంలో లాటరీ బహుమతులపై ఫ్లాట్ 30% పన్ను వర్తిస్తుంది. అదనంగా ఈ పన్ను మొత్తంపై 15% సర్ఛార్జ్ (రూ .1 కోటి కంటే ఎక్కువ గెలుపొందినవారికి), అలాగే మొత్తంపై 4% ఆరోగ్య, విద్యా సెస్ చెల్లించాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి భారతదేశంలో నివాసి హోదాను కలిగి ఉంటే ఈ పన్నుకు లోబడి ఉంటాడు.
ఒక వ్యక్తి భారతదేశంలో నివాసిగా పరిగణించబడాలంటే.. గడిచిన సంవత్సరంలో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండాలి. లేదా గడిచిన సంవత్సరంలో 60 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం, అలాగే అంతకుముందు నాలుగు సంవత్సరాలలో మొత్తం 365 రోజులు భారత్లో నివసించి ఉండాలి.
ఈ రెండు సందర్భాల పరిధిలోకి లాటరీ విజేత రాకపోతే నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) హోదాను కలిగి ఉంటారు. కాబట్టి భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ నివాస హోదా ఉంటే, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం.. ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా.. అది భారతదేశంలోకి తీసుకురాకపోయినా భారతదేశంలో ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది.
అనిల్ కుమార్ బొల్లా దీర్ఘకాలంగా అబుదాబి నివాసి. ఒకటిన్నర సంవత్సరాలకు పైగా ఆయన యూఏఈలో నివసిస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. అంటే ఆయన భారతీయ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇక ఆయన గెలుచుకున్న లాటరీ సొమ్మును భారతదేశానికి తీసుకురాగలడా అంటే.. తీసుకొచ్చేందుకు నిబంధనలు అనుమతించవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ), ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ప్రకారం, బయటి దేశాల్లో లాటరీ ద్వారా గెలుచుకున్న సొమ్మును భారత్లోకి తేవడం నిషేధం.


