ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ భారత మార్కెట్‌లో తన కార్యకలాపాలను మరింత సుస్థిరం చేసుకునే దిశగా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 50,000 మంది నిపుణులను నియమించుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగాల కల్పనతోపాటు అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతలో ఉద్యోగులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గిస్తున్న తరుణంలో డెలాయిట్ తీసుకున్న ఈ నిర్ణయం భారత టెక్ రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
నైపుణ్యాల పెంపే లక్ష్యం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డెలాయిట్ దక్షిణాసియా సీఓఓ నితిన్ కిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థ హెడ్‌కౌంట్‌ను తగ్గించడంపై కాకుండా, సామర్థ్యాలను బలోపేతం చేయడంపైనే దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ‘ఏఐ సాధనాల ద్వారా అత్యంత క్లిష్టమైన, అధిక విలువ కలిగిన పనులను నిర్వహించడానికి మా ఉద్యోగులను సిద్ధం చేస్తున్నాం. కేవలం పని వేగాన్ని పెంచడమే కాకుండా ఉద్యోగులు అధునాతన బాధ్యతలు చేపట్టేలా అప్‌స్కిల్లింగ్‌పై దృష్టి సారించాం’ అని తెలిపారు.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 30,000 మందికి పైగా ఉద్యోగులకు ఏఐలో శిక్షణ పూర్తి చేశారు. సంస్థ తన మొత్తం ఆదాయంలో 9% సామర్థ్యం పెంపు, శిక్షణ, ఆవిష్కరణ కార్యక్రమాల కోసం కేటాయిస్తోంది. డెలాయిట్ అంతర్జాతీయ శ్రామిక శక్తిలో దాదాపు మూడింట ఒక వంతు భారత్‌లోనే ఉండటం విశేషం.
భారతీయ సంస్థల్లో సవాళ్లు
ఏఐ పట్ల ఆసక్తి పెరుగుతున్నప్పటికీ భారతీయ సంస్థల్లో (ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పెద్ద కార్పొరేట్ గ్రూపుల్లో) కొన్ని ప్రాథమిక ఆందోళనలు ఉన్నాయని డెలాయిట్ గుర్తించింది. సున్నితమైన సమాచారం నియంత్రిత వాతావరణంలో భద్రంగా ఉంటుందా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. ఏఐ మోడళ్ల ధరల నిర్ణయం ఎక్కువగా వినియోగం ఆధారంగా ఉంటుంది. దీనివల్ల బడ్జెట్‌పై భారం పడవచ్చని కంపెనీలు భయపడుతున్నాయి.
భద్రత ముఖ్యం
ఆవిష్కరణలు ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యమని నితిన్ కిని నొక్కి చెప్పారు. ‘భారతదేశం ఏఐ అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే బలమైన భద్రతా వ్యవస్థలను నిర్మించడం అనివార్యం’ అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ సాంకేతికతలపై పట్టు సాధించే క్రమంలో డెలాయిట్ భారత్‌లో క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి కొత్త కార్యక్రమాలను కూడా ప్రారంభించనుంది. తద్వారా అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలకు భారతదేశాన్ని గ్లోబల్ సెంటర్‌గా మార్చాలని సంస్థ భావిస్తోంది.
ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు


