వినోదం కోసం..ఫైబర్‌కు సై! | Sakshi
Sakshi News home page

వినోదం కోసం..ఫైబర్‌కు సై!

Published Wed, Feb 21 2024 3:50 AM

Declining popularity of DTH - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా టీవీ వీక్షకులు వినోదం కోసం క్రమంగా డీటీహెచ్‌ (డైరెక్ట్‌ టు హోమ్‌) సర్వీసుల నుంచి ఫైబర్‌ కనెక్షన్ల వైపు మళ్లుతున్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ వేగవంతంగా ఉండటం, అనేకానేక ఓటీటీ యాప్‌లు అందుబాటులోకి రావడం, నెట్‌వర్క్‌ స్థిరంగా ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. దీంతో లక్షల మంది కస్టమర్లు డీటీహెచ్‌ను వదిలేసి ఫైబర్‌ కనెక్షన్లు తీసుకుంటున్నారు.

టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత త్రైమాసికంలో డీటీహెచ్‌ కస్టమర్ల సంఖ్య ఏకంగా 13.20 లక్షలు తగ్గడం ఇందుకు నిదర్శనం. ఫైబర్‌ కనెక్షన్లకు ఆదరణ పెరుగుతుండటమనేది వినోదం విషయంలో ప్రజల అలవాట్లు మారుతుండటాన్ని సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాతావరణంలో మార్పులు, సాంకేతిక లోపాల కారణంగా పదే పదే అంతరాయాలు వస్తుంటాయని డీటీహెచ్‌ సర్విసులపై విమర్శలు ఉన్నాయి. అదే ఫైబర్‌ కనెక్షన్‌లయితే పటిష్టమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా ఉంటాయని ధీమా ఉంటోంది. గ్యారంటీగా నిరంతరాయ సర్వీసుతో పాటు పనితీరు కూడా అత్యుత్తమంగా ఉండటంతో ఇవి మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి.  

యువత దన్ను.. 
జియో సినిమా, జియోటీవీ వంటి ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లు ప్రజల ధోరణులు మారడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫైబర్‌ కనెక్షన్ల ద్వారా అందుబాటులో ఉండే ఈ ప్లాట్‌ఫామ్‌లు.. భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లైవ్‌ స్పోర్ట్స్, లేటెస్ట్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోలు లాంటి బోలెడంత కంటెంట్‌ను హై డెఫినిషన్‌ నాణ్యతతో అందిస్తున్నాయి. ఇంటర్నెట్‌ ద్వారా నిరంతరాయంగా వినోద సర్విసులు అందుబాటులో ఉండటమనేది ఆకర్షణీయంగా ఉండటంతో యువత ఎక్కువగా ఫైబర్‌ కనెక్షన్ల వైపు మొగ్గు చూపుతోంది. గణాంకాల ప్రకారం ఇప్పటికే 2.23 కోట్ల మంది యూజర్లు ఫైబర్‌వైపు మారారు. సాంప్రదాయ డీటీహెచ్‌ సేవలతో పోలిస్తే ఇంటర్నెట్‌ ఆధారిత ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని విశ్లేషకులు తెలిపారు. అదే సమయంలో డీటీహెచ్‌ సర్విసులకు డిమాండ్‌ తగ్గుతుండటాన్ని కూడా సూచిస్తోందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement