
ముంబై : భారీ నష్టాల నుంచి స్టాక్‌మార్కెట్ కోలుకుంది. క్రితం రోజు చోటు చేసుకున్న నష్టాల నుంచి దేశీ సూచీలు కోలుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా షేర్ల ధరలు పడిపోతూ వచ్చాయి. దీంతో తక్కువ ధరలో షేర్లు లభిస్తుండంతో ఇన్వెస్టర్లకు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఆర్బీఐతో జరిగిన సమావేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌కి బూస్ట్ ఇచ్చాయి.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 56,731 పాయింట్లతో మొదలైంది. క్రితం ముగింపుతో పోల్చితే సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. ఉదయం 9:23 గంటలకు 473 పాయింట్లు లాభపడి 56, 879 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 16,963 దగ్గర ట్రేడవుతోంది. ఓఎన్‌జీసీ, కోలిండియా, టీసీఎస్, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభపడగా సిప్లా, ఐషర్ మోటార్స్, ఐసీఐసీబ్యాంక్ షేర్లు నష్టపోయాయి.