ఎకానమీకి కరెంట్‌ అకౌంట్‌ సవాళ్లు! | Current account deficit expected to reach 3. 4percent in Apr-June | Sakshi
Sakshi News home page

ఎకానమీకి కరెంట్‌ అకౌంట్‌ సవాళ్లు!

Sep 20 2022 6:27 AM | Updated on Sep 20 2022 6:27 AM

Current account deficit expected to reach 3. 4percent in Apr-June - Sakshi

ముంబై: భారత్‌ ఎకానమీకి కరెంట్‌ అకౌంట్‌ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అంచనావేస్తోంది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో కరెంట్‌ అకౌంట్‌లో తీవ్ర లోటు (క్యాడ్‌) నమోదుకావచ్చని, ఇది ఏకంగా 36 నెలల గరిష్ట స్థాయిలో 3.4 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ విలువలో) ఉండే వీలుందని తన తాజా నివేదికలో అంచనావేసింది. విలువలో ఇది 28.4 బిలియన్‌ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో కరెంట్‌ అకౌంట్‌లో లోటులేకపోగా 0.9 శాతం మిగులు (6.6 బిలియన్‌ డాలర్లు) నెలకొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి మార్చి త్రైమాసికంలో కరెంట్‌ అకౌంట్‌ లోటు 1.5 శాతం (13.4 బిలియన్‌ డాలర్లు). అయితే తదుపరి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) ఇది ఏకంగా 3.4 శాతానికి చేరుతుందన్న అంచనాలు నెలకొనడం గమనార్హం.  

ఇప్పటికే ఇక్రా హెచ్చరికలు...
భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సీఏడీ– క్యాడ్‌ సవాళ్లు తప్పవని దేశీయ రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే వెలువరించిన నివేదికలో అంచనావేసింది. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022–23లో 3.5 శాతంగా (120 బిలియన్‌ డాలర్లు) ఉండే వీలుందని అంచనావేసింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్‌ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. జూలై, ఆగస్టు నెలల్లో దేశంలోకి భారీ దిగుమతులు జరగ్గా, ఎగుమతులు నామమాత్రపు వృద్ధిని నమోదుచేసుకుంటున్నాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు భారీగా పెరిగిపోతోంది.

ఫారెక్స్‌ దన్ను...
అయితే దేశానికి ప్రస్తుతం ఫారెక్స్‌ విలువ దన్ను పటిష్టంగా ఉంది.  2021 సెప్టెంబర్‌ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్‌ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్‌ వద్ద ప్రస్తుతం  (26 ఆగస్టు నాటికి 561 బిలియన్‌ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి.

కరెంట్‌ అకౌంట్‌... అంటే!
ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్‌ అకౌంట్‌’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్‌ అకౌంట్‌ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్‌ అకౌంట్‌ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement