
భారత పట్టణ మౌలిక సదుపాయాలు, పాలనా వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాల్సిన తక్షణ అవసరాన్ని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తిచూపింది. ఇప్పుడున్న పట్టణ సర్వీసులు, మౌలిక సదుపాయాలు ప్రస్తుత భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని వెనక్కి నెట్టివేసేలా ఉన్నాయని కాగ్ చీఫ్ కె.సంజయ్ మూర్తి హైలైట్ చేశారు. దేశం వికసిత్ భారత్ 2047 విజన్ వైపు ముందుకు సాగుతున్నప్పుడు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతుండడం ఆందోళన రేకిత్తిస్తున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.
కాగ్ డేటాలోని ముఖ్యాంశాలు..
పట్టణ కేంద్రాలు భారతదేశ ఆర్థిక వృద్ధికి ఇంజిన్లుగా మారాయి. అయినప్పటికీ వాటి వృద్ధికి మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలు ప్రమాదకరంగా వెనుకబడి ఉన్నాయి.
కేవలం 15 భారతీయ నగరాలు జాతీయ జీడీపీలో 30% వాటాను కలిగి ఉన్నాయి.
దేశంలో మూడింట ఒక వంతు జనాభాకు నిలయమైన పట్టణ ప్రాంతాలు ఇప్పటికే జీడీపీలో మూడింట రెండో వంతుకు సహకరిస్తున్నాయి.
ఈ వాటా 2030 నాటికి 75%కి పెరుగుతుందని అంచనా.
పట్టణాలకు ప్రాముఖ్యత పెరుగుతున్నప్పటికీ, భారతదేశ నగరాలు పేలవమైన మౌలిక సదుపాయాలు, నమ్మశక్యం కాని సర్వీసులు, మితిమీరిన మునిసిపల్ వ్యవస్థలతో నెట్టుకొస్తున్నాయి.
భారతదేశంలో దాదాపు 5,000 పట్టణ స్థానిక పరిపాలన వ్యవస్థలు (యూఎల్‌జీ) జనాభాలో 35% మందికి సేవలందించాయి. ఈ సంఖ్య 2031 నాటికి 41%కు చేరుకుంటుందని అంచనా.
యూఎల్‌జీలు మొత్తంగా రూ.5.5–6 లక్షల కోట్ల సామూహిక వనరుల పూల్‌ను నిర్వహిస్తున్నాయి.
పట్టణ పరిపాలన వ్యవస్థల్లో మెరుగైన ఆర్థిక ప్రణాళికలు, పారదర్శకత, సకాలంలో ఆడిట్‌లు, ప్రామాణిక పనితీరు కొలమానాల అవసరం ఉంది.
ఎన్ఎంఏఎం 2.0 ప్రారంభం
ఈ వ్యవస్థల సంస్కరణ కోసం కాగ్ నేషనల్ మునిసిపల్ అకౌంట్స్ మాన్యువల్ (ఎన్ఎంఏఎం) పునరుద్ధరణను సూచించింది. ఇది మొదట 2004లో రూపొందించారు. కానీ దీన్ని సమర్థంగా అమలు చేయడంలో యంత్రాంగాలు ఆసక్తి చూపలేదు. ‘ఎన్ఎంఏఎం కొత్త వెర్షన్ నగరాల్లో సమయానుకూలమైన, ప్రామాణిక ఆర్థిక రిపోర్టింగ్‌ను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది’ అని సంజయ్ మూర్తి చెప్పారు. నవీకరించిన ఎన్ఎంఏఎం 2.0 యూఎల్‌జీల ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, పనితీరు ట్రాకింగ్‌ను మెరుగుపరుస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: పోస్టాఫీసుల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌లు అమ్మకం