‘వచ్చిందండి వయ్యారి’ టెక్‌ కంపెనీ సీఈవోగా టాంగ్ యు! షాక్‌లో చైనీయులు

Chinese Metaverse Company Has Appointed A Robot As Its Ceo - Sakshi

ఇన్ని రోజులు ఏ టెక్నాలజీని చూసి అబ్బురపడ్డామో..అదే టెక్నాలజీ మన ఉద్యోగాల్ని కొల్లగొడుతుంది. ఉద్యోగాలు అనడం కన్నా.. మన బతుకులు అనడం సరైందేమో. మన పనులన్నీ రోబోలు చేసేస్తుంటే మనమేం చేయాలి. కొత్త కొత్త ఉద్యోగాల కోసం ఎక్కడని వెతుక్కోవాలి. ఇదిగో ఈ తరహా అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు చైనా నిరుద్యోగులు ! అక్కడి ప్రజలు! ఎందుకంటారా?

ఇప్పటి వరకు  దిగ్గజ సంస్థల్లో  సీఈవోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మనుషుల్ని చూశాం. ఇకపై ఆ పప్పులుడకవ్‌. ఎందుకంటే? డ్రాగన్‌ కంట్రీ టెక్నాలజీ పేరుతో సీఈవోలుగా పనిచేసే మనుషుల స్థానంలో ఇప్పుడు మర మనుషుల్ని నియమించుకుంటుంది. చైనా మెటావర్స్ కంపెనీ తన సీఈవో పదవిలో రోబోను నియమించుకుంది.   దీంతో 'శ్రీమతి టాంగ్ యు' ఏఐ పవర్డ్ వర్చువల్ హ్యూమనాయిడ్ రోబోట్ ఎగ్జిక్యూటివ్ పదవికి అధ్యక్షత వహించిన ప్రపంచంలోనే మొదటి రోబోట్‌గా నిలిచింది. 

చైనాకు చెందిన నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ కంపెనీ మొబైల్ కోసం అప్లికేషన్‌లను తయారు చేస్తుంది. మల్టీప్లేయర్ ఆన్‌లైన్ గేమ్‌లను తయారు చేస్తుంది. అయితే ఈ సంస్థకు నిర్వహణ బాధ‍్యతలు కష్టంగా అనిపించాయోమో. అందుకే ఆ కంపెనీ అనుబంధ సంస్థ ఫుజియాన్ నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ తన పనిని పర్యవేక్షించేందుకు హ్యూమనాయిడ్ రోబోట్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

ఈ సందర్భంగా సీఈవోగా మనుషులు ఎలాంటి విధులు నిర్వహిస్తారో హ్యుమనాయిడ్‌ రోబోట్‌ అలాంటి పనులు చేయదు. కానీ 10 బిలియన్ డాలర్ల సంస్థకు నాయకత్వం వహించడానికి వర్చువల్ సీఈవో పనిచేసేందుకు పూర్తిగా ఫంక్షనల్ ఎగ్జిక్యూటివ్ డ్యూటీలో ఉంచబడుతుందని, కంపెనీ సంస్థాగత, సమర్థతా విభాగాలను ఇది చూసుకోవాలని కంపెనీ భావిస్తోందని నెట్‌ డ్రాగన్‌ ఛైర్మన్ డాక్టర్. డెజియన్ లియు తెలిపారు. 

టాంగ్‌ యు నియామకం గురించి డెజియన్ లియు మాట్లాడుతూ, “ఏఐ అనేది కార్పొరేట్ మేనేజ్మెంట్‌ భవిష్యత్తు అని మేము విశ్వసిస్తాం. అంతిమంగా మా వ్యాపారం, మా భవిష్యత్ వ్యూహాత్మకంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top