6 నెలల్లో లక్ష కోట్లు కోల్పోయిన చైనా బిలియనీర్

Chinese Billionaire Larry Chen Loses Billion Dollars Since Jan - Sakshi

ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన మాజీ పాఠశాల ఉపాధ్యాయుడు లారీ చెన్ పరిస్థితి 6 నెలల్లో తలక్రిందులుగా మారింది. చైనా ప్రభుత్వం ప్రైవేట్ విద్యా రంగంపై కఠిన నియమాలు విధించడంతో చెన్ బిలియనీర్ హోదాను కోల్పోయాడు. గ్వోటు టెచెడు ఇంక్ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన చెన్ ఆస్తి ఇప్పుడు 336 మిలియన్(రూ.24,98,22,38,400.00) డాలర్లకు చేరుకుంది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, తన ఆన్ లైన్-ట్యూటరింగ్ సంస్థ షేర్లు శుక్రవారం న్యూయార్క్ ట్రేడింగ్ లో దాదాపు మూడింట రెండు వంతులు పడిపోయాయి.

చైనా ప్రభుత్వం జూలై 24న విద్యా రంగానికి సంబందించి కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబందనల ప్రకారం పాఠ్యాంశాలను బోధించే సంస్థలు లాభాలు సంపాదించకూడదు, మూలధనాన్ని పెంచుకోకూడదు. 15 బిలియన్(రూ.11,15,27,85,00,000.00) డాలర్లు గల లారీ చెన్ సంపద రూ.2,498 కోట్లకు పడిపోయింది. గావోటు స్టాక్ ధర గత ఆరు నెల కాలంలో భారీగా పడిపోయింది. గావోటు "నిబంధనలను పాటిస్తుంది, సామాజిక బాధ్యతలను నెరవేరుస్తుంది" అని చెన్ శనివారం అర్థరాత్రి చైనీస్ సోషల్ మీడియా వీబోలో తెలిపారు. కేవలం చెన్ మాత్రమే తన సంపదను పోగొట్టుకోలేదు. న్యూయార్క్ లో కంపెనీ షేర్లు 71% పడిపోవడంతో తాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీఈఓ జాంగ్ బాంగ్సిన్ సంపద 2.5 బిలియన్ డాలర్లు నుంచి 1.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 

అలాగే, న్యూ ఓరియంటల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ గ్రూప్ ఇంక్. ఛైర్మన్ యు మిన్హాంగ్ తన బిలియనీర్ హోదాను కోల్పోయారు. ఈ రెండు కంపెనీలు కూడా కొత్త నిబంధనలను పాటిస్తాము అని ప్రతిజ్ఞ చేస్తూ ప్రకటనలను విడుదల చేశాయి. 2014లో గావోటును స్థాపించిన చెన్ కు కరోనా మహమ్మరి సమయంలో భారీగా సంపద కలిసి వచ్చింది. 2020 జనవరిలో అతని కంపెనీ స్టాక్ ధర ఏకంగా 13 రెట్లు పెరిగింది. 2021 జనవరి 27న 142 డాలర్లుగా ఉన్న షేర్ ధర నేడు 2.72 డాలర్లకు పడిపోయింది. చైనాలో ఉన్న ప్రైవేట్ కంపెనీలకు మన దేశంలో ఉన్న సంస్థలకు లాగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండదు. అక్కడి ప్రతి కంపెనీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడవాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top