బాండ్‌, వెనోమ్‌లను వెనక్కి నెట్టిన చైనీస్‌ వార్‌ డ్రామా

China War Drama The Battle At Lake Changjin Ruling Global Boxoffice - Sakshi

కరోనా వల్ల థియేటర్లు మూతపడి సినీ వ్యాపారానికి భారీ నష్టం వాటిల్లింది.  కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా ఆగిపోగా, మరికొన్నింటి షూటింగ్‌ ఆలస్యం అవుతోంది. ఇక బిజినెస్‌కి దెబ్బపడుతుందనే భయంతో ఇంకొన్ని సినిమాలు పోస్ట్‌ పోన్‌ అవుతున్నాయి. ఈ తరుణంలో థియేటర్ల గేట్లు తెరుచుకోవడంతో.. ధైర్యంగా కొందరు సినిమాల్ని రిలీజ్‌ చేస్తున్నారు. 

పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతుండడం ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమకు ధైర్యాన్నిస్తోంది. ఇదిలా ఉంటే గ్లోబల్‌ బాక్సాఫీస్‌ను శాసిస్తాయని భావించిన సినిమాలు.. పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. ఈమధ్యే టామ్‌ హార్డీ ‘వెనోమ్‌ 2’,  డేనియల్‌ క్రెయిగ్‌ జేమ్స్‌ బాండ్‌ మూవీ ‘నో టైం టు డై’  రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ రెండూ కాకుండా..  మరో సినిమా ఇప్పుడు గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతోంది. అదే చైనీస్‌ వార్‌డ్రామా ‘ది బాటిల్‌ ఎట్‌ లేక్‌ చాన్‌గ్జిన్‌’. 

అవి అంతంతగానే..
క్యారీ జోజి ఫుకునగ డైరెక్షన్‌లో రీసెంట్‌గా రిలీజ్‌ అయ్యింది ‘నో టైం టు డై’.  జేమ్స్‌ బాండ్‌గా డేనియల్‌ క్రెయిగ్‌ చివరి చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  దాదాపు 300 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్‌ కమ్‌ ఎమోషనల్‌ డ్రామా.. వీకెండ్‌ కలెక్షన్ల పరంగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం 119 మిలియన్‌ డాలర్లు(ఓవర్సీస్‌లో) వసూలు చేసింది.  ఇక ‘వెనోమ్‌: లెట్‌ దేర్‌ బీ కార్నేజ్‌’..  డొమెస్టిక్‌ సర్క్యూట్‌లో 12.9 మిలియన్‌ డాలర్లు వసూలు చేయగా, రష్యా షోల ద్వారా మరో 13.8 మిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయి. 110 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన వెనోమ్‌-2.. ఇప్పటిదాకా 131.3 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టగలిగింది. ఇక అమెరికన్‌ సైఫై డ్రామా ‘డునే’ 13.7 మిలియన్‌ డాలర్లు వసూలు చేయడం విశేషం. 165 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. కేవలం 103 మిలియన్‌ డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది. 

బాక్సాఫీస్‌ కింగ్‌.. 
చైనా వార్‌ డ్రామా ‘ది బాటిల్‌ ఎట్‌ లేక్‌ చాన్‌గ్జిన్‌’(2021) కలెక్షన్ల సునామీతో గ్లోబల్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. కొరియన్‌ యుద్ధ నేపథ్యంగా చైనా వర్సెస్‌ అమెరికా కోణంలో ఈ సినిమా తీశారు దర్శక త్రయం చెన్‌ కైగె, సుయి హార్క్‌, డాంటే లామ్‌. చైనీస్‌ సైనికుల పోరాటాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా బడ్జెట్‌ 200 మిలియన్‌ డాలర్లు.  ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం..   ‘ది బ్యాటిల్‌ ఎట్‌ లేక్‌ చంగ్‌జిన్‌’ కేవలం వీకెండ్‌ కలెక్షన్లతోనే 237 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ ఫీట్‌ సినిమా ట్రేడ్‌ అనలిస్టులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. మాండరిన్‌ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటిదాకా 405 మిలియన్‌ డాలర్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సందడే కొనసాగుతోంది. దీంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

సర్కార్‌ సహాకారంతోనే..
ది బ్యాటిల్‌ ఎట్‌ లేక్‌ చాన్‌గ్జిన్‌.. కొరియా యుద్దం టైంలో బ్యాటిల్‌ ఆఫ్‌ చోసిన్‌ రిజర్వాయర్‌, ఆ పోరాటంలో అమెరికా ఓటమి నేపథ్యాలుగా తీసిన సినిమా. దేశభక్తి నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాను కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా విపరీతంగా ప్రమోట్‌ చేస్తోంది. అంతేకాదు నెగెటివ్‌ రివ్యూ ఇవ్వడంతో పాటు కొరియన్‌ వార్‌లో చైనా పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసినందుకుగానూ..  లూవో చాంగ్‌పింగ్‌(40) అనే ప్రముఖ జర్నలిస్ట్‌ను అరెస్ట్‌ చేయించింది చైనా సర్కార్‌.  

ఇక బలవంతంగా ఆడించేందుకు ప్రభుత్వమే చైనాలో ఎక్కువ స్క్రీన్లను కేటాయించిందన్న విమర్శ ఒకటి వినిపిస్తోంది. కానీ, చైనా స్క్రీన్‌లను మినహాయించినా.. ఓవర్సీస్‌లో ఈ చిత్రం రాబట్టిన కలెక్షన్లు చాలాఎక్కువేనని సినిమా ట్రేడ్‌ అనలిస్టులు తేల్చేశారు. చైనాలో వరుస సెలవులు కావడంతో   ది బాటిల్‌ ఎట్‌ లేక్‌ చాన్‌గ్జిన్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో హాలీవుడ్‌తో పోలిస్తే.. చైనా సినిమాల డామినేషన్‌ విపరీతంగా కనిపించింది. ‘డిటెక్టివ్‌ చైనాటౌన్‌ 3’ 690 మిలియన్‌ డాలర్లు, ‘హై, మామ్‌’ 840 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టాయి.

చదవండి: ఆస్పత్రికి డబ్బుల్లేక చందాలు.. క్రికెటర్‌ జీవితం నేర్పే పాఠాలివే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top