
భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి సాధించాలంటే బలమైన ప్రైవేట్ మూలధన వ్యయం(private capital expenditure), వినియోగం పెరగాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. రూ.52 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లున్న ఎస్‌బీఐ బ్యాంక్‌కు ఈయన ఇటీవల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తూ, భవిష్యత్తు వృద్ధిని అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేశారు.
దేశాభివృద్ధికి ప్రస్తుతం కొన్ని రంగాల్లో ప్రైవేటు మూలధన వ్యయం జరుగుతుండగా ఉక్కు, సిమెంట్ వంటి కీలక పరిశ్రమలు పెట్టుబడులకు ముందుండాలని శెట్టి సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక పురోగతికి ఈ రంగాలు కీలకమని చెప్పారు. ప్రస్తుత త్రైమాసిక ఆర్థిక గణాంకాలు వృద్ధికి కీలకమైన వస్తు వినియోగంలో సానుకూల ధోరణిని సూచిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్!
భారతదేశం అర్థవంతమైన పురోగతిని సాధించడానికి 8 శాతం జీడీపీ వృద్ధి రేటు అవసరమని నొక్కి చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి వినియోగం పెంపు, ప్రైవేట్ రంగ పెట్టుబడుల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పెరుగుదలపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టారిఫ్ సంబంధిత సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలు నెలకొంటాయని భావించడంలేదని వివరించారు.