కేంద్ర ప్రభుత్వానికి ఇం‘ధనం’

Central govt tax collection on petrol, diesel jumps 300 percent in six years - Sakshi

 పెట్రోల్, డీజిల్‌పై భారీగా పన్నుల వసూళ్లు

ఆరేళ్లలో 300 శాతం అప్‌

2020–21లో ఇప్పటిదాకా రూ. 3 లక్షల కోట్ల కలెక్షన్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ రేట్లు ఆల్‌టైం గరిష్ట స్థాయి నుంచి భారీగా దిగివచ్చినా దేశీయంగా ఇంధనాల రేట్లు మాత్రం రికార్డు గరిష్ట స్థాయిలో తిరుగాడుతున్నాయి. వీటిపై ప్రభుత్వం పన్నుల మోత మోగిస్తుండటమే ఇందుకు కారణం. గడిచిన ఆరేళ్లలో ఇలా పెట్రోల్, డీజిల్‌పై పన్నుల వసూళ్లు 300% పెరిగాయి. మోదీ సర్కార్‌ ఏర్పాటైన తొలి ఏడాది 2014–15లో ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో పెట్రోల్‌పై రూ. 29,279 కోట్లు, డీజిల్‌పై రూ. 42,881 కోట్లు కేంద్రం వసూలు చేసింది. వీటికి సహజ వాయువును కూడా కలిపితే 2014–15లో వీటిపై ఎక్సైజ్‌ రూపంలో రూ. 74,158 కోట్లు ప్రభుత్వానికి చేరాయి.

ఈ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో ఏకంగా రూ. 2.95 లక్షల కోట్లకు చేరాయి. కేవలం పెట్రోల్, డీజిల్‌పై పన్నుల వసూళ్లు రూ. 2.94 లక్షల కోట్లకు పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ లోక్‌సభకు తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో.. పెట్రోల్, డీజిల్, సహజ వాయువుపై విధించే ట్యాక్సుల వసూళ్ల రూపంలో వచ్చేది 2014–15లో 5.4%గా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం 12.2%కి పెరిగిందని ఆయన వివరించారు. పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ 2014లో  లీటరుకు రూ. 9.48గా ఉండగా అదిప్పుడు రూ. 32.90కి పెరిగింది. డీజిల్‌పై రూ. 3.56 నుంచి రూ. 31.80కి చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top