New IT Rules: కేం‍ద్రం కొత్త రూల్స్‌.. డిజిటల్‌ మీడియాలో ఇకపై అలాంటివి కుదరవు!

Central Govt On It Rules: Twitter And Other Social Media Digital Platforms To Comply With Indian Laws - Sakshi

డిజిటల్‌ మీడియాలో చోటుచేసుకుంటున్న ఆగడాలపై కేంద్రం కొరడా ఝళిపించబోతోంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం(ఐటీ యాక్ట్‌) ద్వారా ఆంక్షల కత్తికి మరింత పదును పెట్టింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న జారీ చేసింది.

► ఐటీ యాక్ట్‌ను 2020లో ఆమోదించగా.. 2021 ఫిబ్రవరిలో రూల్స్‌(నిబంధనల)ను అమలులోకి తెచ్చారు. రానురాను డిజిటల్‌ మీడియాలో అనేక పోకడలు ఇబ్బందికరంగా మారడంతో తాజాగా మరోసారి ‘ది ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌) సవరణ నియమాలు–2022 నోటిఫికేషన్‌ను కేంద్రం జారీ చేసింది.

► దీంతో సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్‌ ప్రచార మాధ్యమాలు తదితర డిజిటల్‌ పాల్ట్‌ఫామ్‌లపై మరిన్ని ఆంక్షలు అమలులోకి రానున్నాయి.

► అసత్యాలు, అర్థసత్యాలు, అశ్లీలం, మోసాలు, హింసను ప్రేరేపించడం, కించపరిచే చర్యలతో అడ్డూ అదుపులేకుండా రెచ్చిపోయే కొందరు డిజిటల్‌ మీడియా నిర్వాహకులపై ఐటీ యాక్ట్‌ ప్రకారం కఠిన చర్యలు తప్పవు.

► ప్రధానంగా లోన్‌ యాప్స్‌ మోసాల నేపథ్యంలో లోన్‌ యాప్స్‌ను డిజిటల్‌ మీడియాలో ప్రోత్సహించినా, వాటికి అనుకూలంగా ప్రచారం చేసినా ఐటీ యాక్ట్‌ పరిధిలోకి తెచ్చి చర్యలు తీసుకుంటారు.

► డిజిటల్‌ మీడియా ఖాతా కోసం ఒక వ్యక్తి ఇచ్చే వ్యక్తిగత సమాచారంపై మరొక వ్యక్తికి ఎలాంటి హక్కు ఉండదు. దీన్ని ఉల్లంఘించి వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగించేలా వేరొకరు వ్యవహరించకూడదు.

► డిజిటల్‌ మీడియాలో తమ ఖాతాల ఏర్పాటుకు ప్రైవసీ పాలసీలో భాగంగా వినియోగదారులు ఇంగ్లిష్, తనకు నచ్చిన భాషలో ఇచ్చే వ్యక్తిగత సమాచారాన్ని నిర్వాహకులు, వేరొకరు ప్రచారం చేయడం, మార్పులు(మార్ఫింగ్‌) చేయడం, అప్‌లోడ్‌ చేయడం వంటివి నేరంగానే పరిగణిస్తారు.

► అశ్లీల పోస్టింగ్‌లు, అశ్లీల చిత్రాలు, శారీరక అవయవాల గోప్యతకు భంగం కలిగించడం, లింగ వివక్షతో కూడిన వేధింపులు, మహిళలు, చిన్నారులను కించపరచడం, వేధించడం, హాని కల్గించడం చేస్తే కఠిన చర్యలు తప్పవు.

► లోన్‌ యాప్‌లు, మనీ లాండరింగ్, ఆన్‌లైన్‌ జూదం వంటి వాటిని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ప్రోత్సహిస్తే ఐటీ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకుంటారు.

► ఏదైనా పేటెంట్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్‌ తదితర యాజమాన్య హక్కులను ఉల్లంఘించేలా డిజిటల్‌ మీడియాను వాడుకుంటే ఐటీ యాక్ట్‌ పరిధిలో చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

► కులం, మతం, జాతిపరంగా వివాదాలు సృష్టించడం, హింసను ప్రేరేపించడం నేరమే.

► తప్పుడు సమాచారం ఇవ్వడం, ఉద్దేశపూర్వకంగా వదంతులు, కట్టుకథలు, తప్పుడు సమాచారంతో సమాజాన్ని తప్పుదారి పట్టించడం, అసత్యాలను ప్రచారం చేయడం, మోసగించడం, ఒక వ్యక్తి మరొక వ్యక్తిలా మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం నేరం.

► భారతదేశం ఐక్యత, సమగ్రత, రక్షణ, భద్రత, సార్వభౌమాధికారం, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా డిజిటిల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు.

► కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, కోడ్, ఫైల్, ప్రోగ్రామ్‌ తదితర వాటిని నాశనం చేయడానికి, దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే ఐటీ యాక్ట్‌ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.

చదవండి: వస్తున్నాయ్‌.. పెట్రోల్‌, డీజల్‌,గ్యాస్‌ కాదు ఇవి కొత్త తరం కార్లు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top