నెట్‌వర్క్‌లోలేని ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌.. కానీ..

Cashless Treatment Everywhere In Hospitals From Today - Sakshi

ప్రైవేటు ఆస్పత్రుల్లో నెట్‌వర్క్‌లోలేని హాస్పటల్స్‌లో కూడా ఇవ్వాళ్టి నుంచి క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఈమేరకు కీలక నిర్ణయం వెలువడింది. ఆరోగ్య బీమా తీసుకున్న వారు అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లు ‘ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌’ తెలిపింది. 

బీమా తీసుకుని ఏదైనా సమస్యతో ఆసుపత్రిలో చేరిన వారికి ఇకపై ఇబ్బందులు తొలగనున్నాయి. ఇప్పటివరకు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో చేరితేనే ఎలాంటి డబ్బు చెల్లించకుండా వైద్యం పూర్తయ్యేది. అయితే ఈరోజు నుంచి నెట్‌వర్క్‌ ఆసుపత్రులతోపాటు ఆ జాబితాలో లేని హాస్పటల్స్‌లో చేరినా ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ కీలక ప్రకటన చేసింది. జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 

నెట్‌వర్క్‌ హాస్పిటల్‌ జాబితాలో లేని ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్‌ సదుపాయం వినియోగించుకోవాలంటే సంబంధిత ఇన్సూరెన్స్‌ కంపెనీకు రెండు రోజుల ముందు అంటే 48 గంటల ముందే సదరు వైద్యం గురించి తెలియజేయాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఎమర్జెన్సీ సందర్భాల్లో నెట్‌వర్క్‌లోలేని ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోపు కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్‌ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిం వర్తిస్తుందని కౌన్సిల్‌ వివరించింది.

ఇప్పటివరకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటే నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌లో మాత్రమే క్యాష్‌లెస్‌కు అనుమతి ఉండేది. క్యాష్‌లెస్‌ సదుపాయం లేనిచోట వైద్యానికి అయ్యే ఖర్చును పాలసీదారులే చెల్లించాలి. తర్వాత క్లెయిమ్‌ చేసుకోవాలి. దాంతో ట్రీట్‌మెంట్‌ అయిన ఖర్చు పూర్తిగా ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. ఫలితంగా పాలసీదారులు కొంత నష్టపోయే అవకాశం ఉండేది. దాంతోపాటు ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం, రిఫండ్‌ ప్రక్రియ ఆలస్యం కావడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉండేవి.

ఇదీ చదవండి: దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం!

ప్రస్తుతం 63 శాతం మంది క్యాష్‌లెస్‌ సదుపాయం ఎంచుకుంటుంటే.. మిగిలినవారు రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని కౌన్సిల్‌ ఎండీ, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్ ఇన్సూరెన్స్‌ సీఈఓ తపన్‌ సింఘాల్‌ తెలిపారు. క్లెయిం ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top