స్మార్ట్‌ట్రేడ్‌

Business Ideas With Low Investment - Sakshi

హార్డ్‌ వర్క్‌ కాదు.. ఇప్పుడంతా స్మార్ట్‌ వర్క్‌ కావాలి! ఇది స్మార్ట్‌ ఎరా! కావలసింది ఏదైనా క్షణాల్లో కళ్లముందు ఉండాలి..వేచి చూసే సమయం.. ఓపికా రెండూ లేవు! ఈ పల్స్‌ని పట్టుకుంది ఈ కాలపు వ్యాపారం! జగం స్మార్ట్‌ ఫోన్‌లో ఇమిడి ఉందన్న సత్యాన్ని గ్రహించింది.. స్ట్రాటజీ అల్లుకుంది! సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని మార్కెట్‌ చేసుకుంది.. ప్రపంచాన్నే కస్టమర్స్‌గా మలచుకుంది!ఇబ్బడిముబ్బడిగా బిజినెస్‌ చేస్తోంది!ట్రెండింగ్‌లో ఉన్న ఆ స్మార్ట్‌ ట్రేడ్‌ గురించి కొన్ని వివరాలు.. 

వినోదం.. కాసింత విజ్ఞానం.. అంతా వ్యాపారం.. అనేది సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ సూత్రం. ఇప్పుడు బ్యాంక్‌ అకౌంట్‌ లేనివారున్నారేమో కానీ సోషల్‌ మీడియాలో అకౌంట్‌లేని వాళ్లు లేరు. కొంచెం అతిగా అనిపించినా వాస్తవం అదే! చుట్టూ ఉన్న అంగడినంతా ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు! కాలు కదపక్కర్లేదు. కాలం తెలియనివ్వని కాలక్షేపమూనూ! ఇది కాసులు కురిపిస్తుందని కామన్‌ పీపుల్‌కీ అర్థమైంది. స్మార్ట్‌ ఫోన్‌ను అత్యవసర వస్తువుగానే కాదు కమర్షియల్‌ ఎలిమెంట్‌గానూ ట్రీట్‌ చేయడం మొదలుపెట్టారు. అంతే సెల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయిన సోషల్‌ మీడియా సింపుల్‌గా ఓ కుటీర పరిశ్రమ అయిపోయింది. కాలక్షేపం, ఆర్ట్‌.. ఆసక్తులు.. అభిరుచులనూ బిజినెస్‌గా మలచుకోవచ్చని నేర్పుతోంది. క్రియేటివ్‌ కంటెంట్‌ నుంచి వంటింటి చిట్కాల దాకా అంతా వ్యాపారమే! పైగా దీనికో కొట్టు.. దాని మెయింటెనెన్స్‌.. అడ్వర్‌టైజ్‌మెంట్‌.. ప్రమోషన్‌ కోసం సెలబ్రిటీలు.. మార్కెటింగ్‌ స్టాఫ్‌.. వంటి ఖర్చులేమీ లేకుండా అన్నీ తానై యజమానే సింగిల్‌ హ్యాండ్‌తో హ్యాండిల్‌ చేసుకోవచ్చు. అందుకే సామాన్యుల నుంచి బిజినెస్‌ టైకూన్స్‌ వరకు అందరూ సోషల్‌ మీడియా మార్కెట్‌లో అకౌంట్లు తెరిచారు. స్టార్టప్స్‌కైతే వరమనే చెప్పుకోవచ్చు. కోవిడ్‌ లాక్‌డౌన్‌ ఈ సోషల్‌ మీడియా మార్కెట్‌కి మరింత ఊతమిచ్చింది. బయట ప్రపంచమంతా షట్‌ డౌన్‌ అయిపోయి ఓన్లీ సోషల్‌ మీడియా యాక్టివ్‌ అయింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరైతే ఆ మార్కెట్‌లో ఏమేం ఉన్నాయో చూద్దాం! 

రీల్స్‌.. షాట్స్‌ నుంచి.. 
‘పనీపాటా లేదా? 24 గంటలూ రీల్స్‌.. షాట్సేనా అని అడిగేవాళ్లకు ఈ సమాధానం.. పనీపాటా ముగించుకుని.. పనీపాటా మానేసి.. సోషల్‌ మీడియాలో తలదూర్చే వాళ్లకోసమే మేం పనీపాటా పక్కన పెట్టి రీల్స్, షాట్స్‌ చేస్తున్నాం’ అని చెప్పే రీల్‌ ఉంటుంది ఇన్‌స్టాలో. కొంచెం వ్యంగ్యంగా అనిపించినా అందులో నిజం ఉంది. ఆ నిజం చుట్టే సోషల్‌ మీడియాలో వ్యాపారం సాతుతోంది. వేలం వెర్రిగా పెరుగుతున్న.. తిరుగుతున్న రీల్స్‌.. షాట్స్‌ అన్నీ డబ్బులు ఊరించేవే. ‘రాత్రి రీల్స్‌ చూస్తూ నిద్రను మరచిపోతున్నాను. అందుకే పడుకునే ముందు సెల్‌ ఫోన్‌ బెడ్‌ మీద కాకుండా టేబుల్‌ మీద పెట్టాలని నిర్ణయించుకున్నా. ఆ టేబుల్‌ని బెడ్‌కి దగ్గరగా జరుపుకొన్నా. ఇప్పుడు టేబుల్‌ మీద సెల్‌ పెట్టి రీల్స్‌ చూస్తున్నా’ అంటూ తను ఇన్‌స్టాకు ఎంత ఎడిక్ట్‌ అయ్యాడో చెప్పుకున్నాడు ప్రముఖ స్టాండప్‌ కమేడియన్‌ రాజశేఖర్‌ మామిడాల ఒక స్టాండప్‌ కామెడీ షోలో. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు సోషల్‌ మీడియా మార్కెట్‌ ఎంత బలమైందో! 

లాభాల గిఫ్ట్స్‌..
అందమైన రేపర్‌లో చుట్టిన కానుక ఏంటో అని కుతూహలం కలగనివారుంటారా? అలాంటి ఆసక్తికరమైన గిఫ్ట్స్‌ కస్టమైజ్‌ సౌకర్యంతో సోషల్‌ మీడియా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. నోములు – వ్రతాలు, పండగపబ్బాలకు ఇచ్చే ఆకు, వక్క తాంబూలం, వాయనాల నుంచి బర్త్‌డేలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, గెట్‌ టుగెదర్‌ పార్టీలకు ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్స్‌ వరకు అన్ని రకాల కానుకలను ఆర్డర్‌ ఇచ్చిన వాళ్ల అభిరుచి.. ఆయా పార్టీల థీమ్‌కి తగ్గట్టుగా తయారు చేసి హోమ్‌ డెలివరీ చేస్తున్నారు వయా సోషల్‌ మీడియా మార్కెట్‌! ఈ గిఫ్ట్స్‌ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంటున్నాయి. అందుకే ఈ వ్యాపారానికి చాలా డిమాండ్‌ ఉంది.

మూడు పువ్వులు .. ఆరు అగరుబత్తులు
ఇప్పుడు పువ్వుల కోసమూ బయట మార్కెట్‌కి వెళ్లక్కర్లేదు. అవీ సోషల్‌ మీడియాలో దొరుకుతున్నాయి. ప్లాస్టిక్‌ పువ్వులు కాదండీ.. ప్రాణమున్న సుమాలే! ఇందులో ఎక్కువగా మల్లెలు, బంతి, చామంతి, గులాబీలు, కట్లపూలు, మందార, తామరపువ్వులు లభిస్తున్నాయి. పండగలు, నోములు, వ్రతాలు, పెళ్లిళ్లు, బర్త్‌ డే ఫంక్ష¯Œ ్స వంటి ప్రత్యేక సందర్భాల అలంకరణకు అవసరమయ్యే ప్రత్యేక పువ్వులూ దొరుకుతున్నాయి. ఇలా తాజా పువ్వులతో ఈ బిజినెస్‌ నడుస్తూంటే .. ఫంక్షన్స్‌ అయిపోయాక ఆ వాడిపోయిన పువ్వులతో మరో బిజినెస్‌ అంతే లాభాలతో సాగుతోంది. ఆ వాడిపోయిన పూలను చెత్తలోనో.. నీటిలోనో పడేయకుండా వాటిని సేకరించి ఎండబెట్టి.. అగరుబత్తులు, ధూప్‌ స్టిక్స్‌ తయారుచేసి అదే సోషల్‌ మీడియా మార్కెట్‌లో అమ్ముతున్నారు. వీటికి మంచి డిమాండ్‌ ఉంటోంది. ఇటు తాజా.. అటు వాడిన పూల వ్యాపారం కోట్లలో సాగుతోందట. 

పాత జ్ఞాపకాలతో కొత్త వస్తువులు
చాలామందికి కొన్ని వస్తువులతో ప్రత్యేకమైన ప్రేమానుబంధాలు ఉంటాయి. అలాంటి జ్ఞాపకాల నేతను అల్లుకున్న పాత దుస్తులను పంపిస్తే.. వాటితో అందమైన బ్యాగులు, పర్సులు తయారు చేస్తున్నారు సోషల్‌ మీడియా మార్కెట్‌లో. పాత దుస్తులను రీసైక్లింగ్‌ ద్వారా కొత్త వస్తువులుగా మలచడం కొంత మందికి ఆసక్తి.. అభిరుచి కూడా. దాన్నే వాళ్లిప్పుడు సోషల్‌ మీడియా మార్కెట్‌ ద్వారా ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. సంచులు, బ్యాగులు, పౌచులు.. తయారుచేసి సోషల్‌ మీడియా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.  

ఇంట్రెస్టింగ్‌ వేస్ట్‌..
వేస్ట్‌ బాటిల్స్, విరిగిపోయిన వాటర్‌ పైప్స్, పనికిరాని టైర్స్, డామేజ్‌ మగ్గులు, పగులు ఏర్పడ్డ కుండలు, నూనె డబ్బాలు, చెడిపోయిన సీడీలు వంటివన్నీ చేరేది డస్ట్‌ బిన్‌లోకే. కానీ ఆ చెత్త నుంచి కొంతమంది అద్భుతాలు సృష్టిస్తున్నారు. గృహాలంకరణ వస్తువులతోపాటు కూరగాయల సాగూ చేస్తూ ఆ వ్యర్థాలకు కొత్త అర్థమిస్తున్నారు. టైంపాస్‌గా మొదలైన ఈ ఇంట్రెస్టింగ్‌ హాబీని సోషల్‌ మీడియా మార్కెట్‌ ద్వారా ఓ కెరీర్‌గా మలచుకుంటున్నారు. ఇంట్లో పెట్టుకునే ఫొటో ఆల్బమ్స్, ఫొటో ప్రింటెడ్‌ ల్యాంప్స్, హ్యాండ్‌ మేడ్‌ కార్డ్స్‌ నుంచి ఒంటికి పెట్టుకునే ఫ్యాషన్‌ జ్యూలరీ దాకా వివిధ రకాల వస్తువులను తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సాయం..
ఆధునిక సాంకేతికతను అందుకోవడంలో వ్యాపారం ఎప్పుడూ ముందే ఉంటుంది. ఆ క్రమంలోనే అమెజాన్‌ వంటివి ఆన్‌లైన్‌ మార్కెట్‌కి గొడుగుపట్టాయి. పెద్ద పెద్ద బ్రాండ్స్‌ వాటి కిందకు చేరాయి. ఆన్‌లైన్‌ మార్కెట్‌ను అనివార్యం చేసిన కోవిడే సోషల్‌ మీడియా మార్కెట్‌కూ దారిని చూపించింది. డిమాండ్‌ పెరుగుతున్న ఈ మార్కెట్‌కి పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా పబ్లిసిటీ కల్పిస్తున్నాయి. ఉదాహరణ.. షార్క్‌ ట్యాంక్‌ ఇండియా అనే హిందీ షో. బిజినెస్‌ అనేది  బ్రహ్మపదార్థం కాదు.. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని మాట్లాడుకోగలిగినంత కామన్‌ థింగ్‌ అని చూపించింది.. సగటు మనిషీ బిజినెస్‌ కలను కనేలాచేసింది ఆ షో.  దేశం నలుమూలల నుంచి చిన్న చిన్న వ్యాపారులను ఆహ్వానించి.. వారి ఫెయిల్యూర్‌ అండ్‌ సక్సెస్‌ స్టోరీలను చెప్పించింది. ఔత్సాహిక వ్యాపారుల్లో స్ఫూర్తి నింపింది. క్రైమ్‌ సిరీస్‌ను చూసినట్టుగా షార్క్‌ ట్యాంక్‌ ఇండియాను కూడా బింజ్‌ వాచ్‌ చేశారట. దాన్నిబట్టే చెప్పొచ్చు సోషల్‌ మీడియా మార్కెట్‌కున్న క్రేజ్‌.. డిమాండ్‌ ఎట్‌సెట్రా ఎలాంటిదో! షార్క్‌ ట్యాంక్‌ ఇండియాలాగే ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ ఓ షో నడుస్తోంది ‘సూపర్‌ విమెన్‌’ పేరుతో. సోషల్‌ మీడియాలోని ఆంట్రప్రెన్యూర్స్‌ కోసం ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా ఇటీవల ‘అమెజాన్‌ ఇండియా స్మాల్‌ బిజినెస్‌ డేస్‌’ అనే సేల్‌ని పెట్టింది. తన ప్లాట్‌ఫామ్‌ ద్వారా కూడా వాళ్లు వ్యాపారం చేసుకునే వీలు కల్పిస్తూ. లక్షలాది చిన్న వ్యాపారులు, 1,000కి పైగా స్టార్టప్‌ కంపెనీలు, 6.8 లక్షల మంది మహిళా వ్యాపారులు, 12 లక్షల పైచిలుకు చేతివృత్తులవారు, చేనేత కళాకారులు, 50,000 దాకా స్థానిక దుకాణదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని అమెజాన్‌ తెలిపింది. ఇలా ఏడాదికి రెండుసార్లు సోషల్‌ మీడియా వ్యాపారులకు తన ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునే వీలు కల్పిస్తోంది. ఇదే తరహాలో మరికొన్ని ఈ కామర్స్‌ సంస్థలూ సోషల్‌ మీడియా వ్యాపారులకు తమ చేయూతను అందించనున్నాయట.  

వీళ్లంతా.. 
 దేశంలో మొత్తం 229 మిలియన్ల జనం ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అలాగే మన దగ్గర 467 మిలియన్లకు పైగా జనం యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదీ ప్రపంచంలో అత్యధికమే. మన దగ్గర ఎక్స్‌ (మాజీ ట్విటర్‌) యూజర్స్‌ సంఖ్య 27. 25 మిలియన్లకు పైమాటే. దీంట్లోనూ మనమే ముందున్నాం. ఇలా సోషల్‌ మీడియాలోని పలు ప్లాట్‌ఫామ్స్‌ని ఉపయోగిస్తున్న యూజర్స్‌ అందరూ కూడా ఏదోరకంగా సోషల్‌ మీడియా బిజినెస్‌ను ప్రభావితం చేస్తున్నవారే. ఈ సంఖ్య పెరిగే అవకాశమే ఉంటుంది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు వర్చువల్‌ మార్కెట్‌కు ఉన్న స్కోప్‌ని. అయితే మోస్తరు పట్టణాల్లో ఇంకా సంప్రదాయ పద్ధతుల్లోనే వ్యాపారం చేస్తున్నారు. సోషల్‌ మీడియా ప్రభావాన్ని వాళ్లు అంతగా పట్టించుకోవట్లేదు. కాని వర్చువల్‌ మార్కెట్‌ స్కోప్‌ని గ్రహించి వీలైనంత త్వరగా తమ వాళ్లూ తమ వ్యాపార వృద్ధికి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకోవాలని అభిప్రాయపడుతోంది ఆ సంప్రదాయ వ్యాపారకుటుంబాల్లోని నేటి తరం. 

భోజనం తయారు
‘సముద్రం ఒడ్డున చింతపండు దొరకదు.. అడవిలో ఉప్పు దొరకదు. ఈ రెండింటినీ కలిపి పట్టణాల్లో పచ్చడిగా అమ్మితే పచ్చనోట్ల పంట పండుతుంది’ అని పచ్చళ్ల వ్యాపారానికి కిటుకు కనిపెట్టారు వ్యాపారులు. నగరాల్లో ఇప్పుడున్న కర్రీ పాయింట్స్‌కీ ఆ కిటుకే ప్రేరణ. సోషల్‌ మీడియాలోని ఈ భోజనం తయారీ బిజినెస్‌కి కూడా! దాని పేరే ‘హోమ్‌ షెఫ్స్‌’.  చదువులు, కొలువుల కోసం కుటుంబాలను వదిలి సిటీస్‌కి వచ్చిన వారిని చవులూరిస్తోంది. వండి పంపిస్తున్న వారి వాలెట్‌ నింపుతోంది. రుచికి.. శుచికి అమ్మ చేతి వంటను మరపిస్తోంది. ధరనూ అందుబాటులోనే ఉంచుతోంది సోషల్‌ మీడియాలో ఈ సరికొత్త హోటల్‌ వ్యాపారం. పండగలప్పుడు పిండి వంటలు, స్వీట్స్‌ సహా ఉగాది పచ్చడినీ  చేయించుకుని మరీ ఆరగించవచ్చు. ఇప్పుడు జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ సర్వీసెస్‌ కూడా సోషల్‌ మీడియాలోని హోమ్‌ షెఫ్స్‌తో అనుసంధానం అవుతున్నాయి. ఆర్డర్‌ అందిన వెంటనే  వేడి వేడి మీల్స్‌ తయారు చేసి ఉంచితే..  ఈ ఫుడ్‌ డెలివరీ పార్టనర్స్‌  డెలివరీ చేస్తాయి. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ఈ సర్వీస్‌ అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించనుందట. వంటను ఆర్ట్‌గా భావించే చాలామంది కుకింగ్‌ లవర్స్‌ని ఆంట్రప్రెన్యూర్స్‌గా మార్చనుందీ కాన్సెప్ట్‌ అంటున్నారు సోషల్‌ మీడియా మార్కెట్‌ నిపుణులు. 

మేకప్‌ .. ఫ్యాషన్‌..
అలంకరణ అంటే ఆసక్తి చూపని అమ్మాయిలు అరుదు. ఆ మెజారిటీనే తమ ఆదాయానికి వనరుగా మార్చుకుంటున్నారు కొందరు .. మేకప్‌ వేసుకునే విధానాన్ని వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ! ఇంకొంత మంది ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ని ఎర్నింగ్‌ సోర్స్‌గా మలచుకుంటున్నారు. ఫ్యాషన్‌ అంటే ఉన్న ఇంట్రెస్ట్‌తో తమ సృజనకు పదును పెట్టి కాజువల్‌ వేర్‌ నుంచి వెడ్డింగ్‌ వేర్‌ వరకు డ్రెసెస్‌ను డిజైన్‌ చేసి సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఇట్టే డెమో ఇచ్చి.. అట్టే బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బును జమ చేసుకుంటున్నారు. అలా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిపోయి.. అదే సోషల్‌ మీడియా మార్కెట్‌ ద్వారా ఆంట్రప్రెన్యూర్‌గానూ అంతే సక్సెస్‌ను సాధిస్తున్నారు. స్థానికంగానే కాదు దేశీయ,అంతర్జాతీయ ఆర్డర్లనూ అందుకుంటూ అదే స్థాయిలో పాపులర్‌ అవుతున్నారు. ఇదే బాటలో జ్యూలరీ డిజైనింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ కూడా సాగుతోంది. 

77 శాతం మంది చిన్న వ్యాపారులు తమ వినియోగదారులతో కనెక్ట్‌ అవడానికి సోషల్‌ మీడియానే ఆశ్రయిస్తున్నారట. 2025 నాటికి ఈ డైరెక్ట్‌  టు కస్టమర్‌ మార్కెట్‌ వంద బిలియన్‌ డాలర్లకు చేరనుందని మార్కెట్‌ పరిశోధన నివేదికలు చెబుతున్నాయి.   

:::దీపిక కొండి 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top