Gautam Adani: తగ్గేదేలే అంటున్న గౌతమ్‌ అదానీ.. మరో రికార్డు సొంతం

Bloomberg Report: Gautam Adani Joined in 100 Bn Dollars Club - Sakshi

అదానీ గ్రూప్స్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ మరో రికార్డు సాధించారు. ముకేశ్‌ అంబానినీ వెనక్కి నెట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తొలిసారిగా వంద బిలియన్ల డాలర్ల క్లబ్‌లో చేరాడు. బ్లూంబర్గ్‌ తాజాగా ప్రకటించిన ఐశ్వర్యవంతుల జాబితాలో గౌతమ్‌ అదానీ వంద బిలియన్‌ డాలర్ల మార్కుని దాటారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడి హోదాను మరోసారి దక్కించుకున్నారు.

గత రెండేళ్లుగా గౌతమ్‌ అదానీ సంపద ఆకాశమే హద్దుగా పెరిగిపోతుంది. ముఖ్యంగా మైనింగ్‌, గ్రీన్‌ ఎనర్జీ, పోర్టుల రంగంలో అదానీకి తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తోంది. పైగా ఇటీవల సౌదీ ఆరామ్‌కోతో సైతం అదానీ జట్టు కట్టారు. అన్నింటికి మించి రెండు నెలలుగా అదానీ గ్రూపుకి చెందిన కుకింగ్‌ ఆయిల్‌ విల్మర్‌ కంపెనీ షేర్లు 130 శాతం పెరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడింది. ఇలా అనేక అంశాలు అనుకూలంగా మారడంతో అదానీ సంపద రాకెట్‌ వేగంతో పరుగులు పెడుతోంది.

వంద బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి తొలిసారిగా మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ప్రవేశించారు. 1999లో ఆయన సంపద విలువల వంద బిలియన్‌ డాలర్లు దాటింది. ఆ తర్వాత వారెన్‌ బఫెట్‌ వంటి వారు ఈ జాబితాలో చోటు సాధించారు. 2017లో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బేజోస్‌ వచ్చిన తర్వాత పోటీ ఎక్కువైంది. జెఫ్‌బేజోస్‌ రికార్డును 2021లో ఎలన్‌ మస్క్‌ క్రాస్‌ చేశారు. ప్రస్తుతం ఎలన్‌ మస్క్‌ 270 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే కుబేరుడిగా ఉన్నారు. 99 బిలియన్‌ డాలర్లతో రిలయన్స్‌ ముకేశ్‌ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు.
 

చదవండి: బ్రాండెడ్‌ బియ్యంపై అదానీ విల్మర్‌ దృష్టి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top