రూ.1.4 కోట్ల బిల్లు కస్టమర్లకు వాపస్! | Barbecue Chain Refunds Rs 1 4 Cr to Customers | Sakshi
Sakshi News home page

రూ.1.4 కోట్ల బిల్లు కస్టమర్లకు వాపస్!

May 29 2026 4:41 PM | Updated on May 29 2026 4:49 PM

Barbecue Chain Refunds Rs 1 4 Cr to Customers

వ్యాపారంలో లాభాల కంటే వినియోగదారుల నమ్మకమే ముఖ్యమని బార్బెక్యూ రెస్టారెంట్ తెలిపింది. తాము అందించిన ఆహారం సొంత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని గ్రహించిన సదరు యాజమాన్యం.. ఏకంగా కస్టమర్లకు సుమారు రూ.1.4 కోట్లు (1,62,000 అమెరికన్ డాలర్లు / 1.1 మిలియన్ యువాన్లు) తిరిగి చెల్లించింది. కస్టమర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోయినా సంస్థే స్వయంగా ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకుంది. ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. చైనావ్యాప్తంగా 142 అవుట్‌లెట్లతో విస్తరించిన ప్రసిద్ధ బ్రాండ్ ‘వెరీ లాంగ్ అగో లాంబ్ స్కేవర్స్’ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

అసలేం జరిగింది? గ్రిల్లింగ్‌లో లోపమే కారణమా?

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీకి చెందిన 24 అవుట్‌లెట్లలో దాదాపు 48,000 టేబుల్స్ వద్ద భోజనం చేసిన కస్టమర్లను రెస్టారెంట్ యాజమాన్యం ఈ నెల ప్రారంభంలో స్వయంగా సంప్రదించింది. అంతర్గత నాణ్యత సమీక్షలో ఒక షాకింగ్ నిజం బయటపడటమే దీనికి కారణం. ఆ సమయంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రిల్లింగ్ పరికరాల్లో ఉష్ణోగ్రత స్థిరంగా లేకపోవడం వల్ల, మటన్ కబాబ్‌లు ఆశించిన స్థాయిలో గ్రిల్ కాలేదని కంపెనీ గుర్తించింది. కస్టమర్ల నుంచి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులు రానప్పటికీ తమ బ్రాండ్ విలువలకు కట్టుబడి సదరు మటన్ స్కేవర్ల ధరలో 50 శాతం మొత్తాన్ని ఖాతాదారులకు రీఫండ్ చేసింది.

నిజాయితీయా? మార్కెటింగ్ జిమ్మిక్కా?

ఈ భారీ వాపసు కార్యక్రమం నెట్టింట వైరల్‌గా మారడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘లాభాల కంటే కస్టమర్ల సంతృప్తికే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించిన రెస్టారెంట్ నిజాయితీ అమోఘం’ అని మెజారిటీ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇది బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకోవడానికి, పబ్లిసిటీ కోసం ప్లాన్ చేసిన ఒక తెలివైన మార్కెటింగ్ వ్యూహం కావచ్చునని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement