దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో చేతులు కలిపి డిజిటల్ ఇండియా దిశగా మరో అడుగు వేసింది. స్మార్ట్‌ఫోన్ లేని సామాన్యులకు కూడా అత్యాధునిక బ్యాంకింగ్ సేవలను చేరువ చేస్తూ ఫీచర్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘బాబ్ వరల్డ్ లైట్’ను సోమవారం అధికారికంగా ప్రారంభించింది.
ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో జియోఫోన్ ‘ప్రైమా 4జీ’ ద్వారా ఈ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. భారత ప్రభుత్వం, ఆర్‌బీఐ ఆశిస్తున్న ఆర్థిక సమగ్రత లక్ష్య సాధనలో ఈ పరిణామం ఒక కీలక మలుపుగా నిలవనుంది.
సాధారణంగా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు కేవలం హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్లకే పరిమితమవుతుంటాయి. కానీ, 'బాబ్ వరల్డ్ లైట్' దీనికి భిన్నం. బ్యాంకు, జియో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ ఇంటర్నెట్ వేగం ఉన్నా ఈ యాప్ నిరాటంకగా పనిచేస్తుంది. టచ్ స్క్రీన్ అవసరం లేకుండా కీప్యాడ్‌తోనే సులభంగా ఆపరేట్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా సులభమైన నమోదు ప్రక్రియ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.
ఏయే సేవలు అందుబాటులో ఉంటాయంటే..
యూపీఐ ఆధారిత స్కాన్ అండ్ పే
మనీ ట్రాన్స్‌ఫర్ (డబ్బు పంపడం)
బిల్లుల చెల్లింపులు, రీచార్జ్‌లు
ప్రొఫైల్ మేనేజ్‌మెంట్
జియోఫోన్ ప్రైమా 4జీ పరికరాల్లో ఈ యాప్ ముందే లోడ్ చేయబడి ఉంటుంది. పాత వినియోగదారులు జియో స్టోర్ ద్వారా దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘డిజిటల్ బ్యాంకింగ్‌ను కోట్లాది మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు చేరవేయడమే మా ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో ఈ ‘లైట్’ వెర్షన్ కీలక పాత్ర పోషిస్తుంది’ అని దేవదత్త చంద్ర్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తెలిపారు.
ఈ భాగస్వామ్యం గురించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అధ్యక్షుడు సునీల్ దత్ మాట్లాడుతూ, ‘జియో ఎప్పుడూ సామాన్యుడికి డిజిటల్ సేవలను అందుబాటు ధరలో అందించడానికే ప్రాధాన్యత ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిపి మేము అందిస్తున్న ఈ సేవలు దేశవ్యాప్తంగా ఉన్న జియోఫోన్ వినియోగదారులకు సురక్షితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తాయి’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు


