బజాజ్ ప్రేమికుల కోసం చేతక్ ప్రీమియం ఎడిషన్‌.. ధర, రేంజ్ వివరాలు

Bajaj chetak premium variant launched prices details - Sakshi

దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు వాహనాలు అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇందులో భాగంగానే ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న బజాజ్ చేతక్ 'ప్రీమియం ఎడిషన్‌'లో విడుదలైంది. ఈ ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). 

బజాజ్ కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ని మూడు కలర్ ఆప్సన్స్‌లో విడుదల చేసింది. అవి మాట్ కోర్స్ గ్రే, మాట్ కరేబియన్ బ్లూ, శాటిన్ బ్లాక్ కలర్స్. అంతే కాకుండా ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ సీటు, బాడీ కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్‌రెస్ట్ కాస్టింగ్‌లు, హెడ్‌ల్యాంప్ కేసింగ్, బ్లింకర్లు వంటి వాటిని పొందుతుంది.

భారతదేశంలో కంపెనీ ఈ కొత్త బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి డీలర్‌షిప్‌లను విస్తరించనుంది. 

ప్రస్తుతం బజాజ్ చేతక్ డీలర్‌షిప్ నెట్‌వర్క్ భారతదేశంలోని 60 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించి ఉంది. అంతే కాకుండా 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 85 కంటే ఎక్కువ నగరాల్లో 100 కంటే ఎక్కువ స్టోర్‌లకు విస్తరించడానికి ఆ వైపుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికి కంపెనీ ప్రతి నెల 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ధర ప్రీమియం ఎడిషన్ కంటే తక్కువ. ఇప్పుడు ఈ వేరియంట్ ధర రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇది బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్ నట్, ఇండిగో మెటాలిక్, వెల్లుటో రోస్సో అనే నాలుగు కలర్ ఆప్సన్స్‌లో అందుబాటులో ఉంది.

బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ బ్యాటరీ ప్యాక్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్ లేదు. కావున ఇందులో అదే 2.9 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 4.2kW ​​పీక్ పవర్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఛార్జ్‌పై 90 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. బజాజ్ చేతక్ ఎక్కువ అమ్మకాలు జరపకపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పవచ్చు.

దేశీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ వంటి స్కూటర్లు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తున్నాయి, కొనుగోలుదారులు కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున చేతక్ క్లెయిమ్ చేసిన ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ (IDC) పరిధిని 20 శాతం పెంచి 108కిమీలకు పెంచబోతున్నట్లు బజాజ్ ఆటో గత నెలలో ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇదే జరిగితే చేతక్ అమ్మకాలు తప్పకుండా పెరిగే అవకాశం ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top