తీరు మారింది, లోన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిరగడం మానేశారు | Sakshi
Sakshi News home page

తీరు మారింది, లోన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిరగడం మానేశారు

Published Sat, Nov 20 2021 9:43 AM

Apply for Personal Loan Online in India - Sakshi

న్యూఢిల్లీ: రుణం తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లడం, పేపర్లకు పేపర్లు నింపి సంతకాలు చేయడం వంటి సాంప్రదాయక ‘ఆఫ్‌లైన్‌’ విధానాలకు రుణ గ్రహీతలు క్రమంగా దూరం అవుతున్నారు. రుణం పొందేందుకు ఆఫ్‌లైన్‌  ద్వారా కాకుండా ఆన్‌లైన్‌కు మొగ్గుచూపే కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రత్యేకించి మిలీనియల్స్‌ (1977 నుంచి 1995 మధ్య జన్మించిన వారు) ఈ విషయంలో ముందు ఉంటున్నారు. 

పలు సంవత్సరాల నుంచీ మొదలైన ఈ వైఖరి కోవిడ్‌–19 సవాళ్లతో మరింత వేగం పుంజుకుంది. డిజిటల్‌ సేవలు విస్తరించడం కూడా ఈ విషయంలో కలిసి వస్తున్న ఒక అంశం. ఆయా అంశాలపై ఆర్థిక సంస్థ– హోమ్‌ క్రెడిట్‌ ఇండియా నిర్వహించిన వార్షిక సర్వే ’హౌ ఇండియా బారోస్‌’ (హెచ్‌ఐబీ)  తెలిపిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి... 

దాదాపు 40 శాతం మంది రుణగ్రహీతలు రుణాలు తీసుకోవడానికి డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లపై సుముఖత వ్యక్తం చేశారు. ఇటీవల వరకూ ఇది కేవలం 15 శాతంగా ఉండేది.  

హైదరాబాద్‌సహా ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, భోపాల్, ముంబై, కోల్‌కతా, పాట్నా, రాంచీల్లో ఈ అధ్యయనం జరిగింది. 21–45 సంవత్సరాల వయస్సు మధ్య వయస్సువారు 1,200 మంది  (హోమ్‌ క్రెడిట్‌ కస్టమర్‌లు) సర్వేలో పాల్గొన్నారు. వీరందరూ నెలకు రూ. 30,000 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నారు.  

గత సంవత్సరంతో పోల్చితే 2021లో గృహ వ్యయాల కోసం తీసుకునే రుణాలు గణనీయంగా తగ్గాయి. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం దీనికి కారణం. రుణ గ్రహీత అవసరాల ఆధారిత రుణం నుండి కోరిక ఆధారిత రుణాల వైపు మొగ్గుచూపడం పెరుగుతుండడం కనిపిస్తోంది. 

మొత్తం రుణ గ్రహీతల్లో 28 శాతం మంది వ్యాపారం ఏర్పాటు లేదా విస్తరణకు సంబంధించి రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత చిన్న రుణాలు తీసుకునే వారు 26 శాతం మంది ఉన్నారు. వీటిలో అధికంగా రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కూలర్లు, కండీషనర్లు,  కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ కొనుగోళ్లు ఉన్నాయి. మిగిలిన వాటిలో గృహ పునరుద్ధరణ, కొత్త నిర్మాణం (13 శాతం), వైద్య అత్యవసర పరిస్థితి (2 శాతం), వాహన రుణం (9 శాతం), వివాహం (3 శాతం), విద్యా రుణం (2 శాతం), పెట్టుబడులు,  మునుపటి రుణం చెల్లింపుల (1 శాతం) వంటివి ఉన్నాయి.  

ప్రాంతీయంగా చూస్తే, బెంగుళూరు,  హైదరాబాద్‌ కరోనా మహమ్మారి సవాళ్ల నుండి వేగంగా కోలుకుంటున్నాయి.  హైదరాబాద్‌లో 41 శాతం (సర్వేలో పాల్గొన్న వారిలో) మంది వ్యాపార పునరుద్ధరణ కోసం రుణాలు తీసుకున్నారు. బెంగళూరు విషయానికి వస్తే, కొనుగోలు కోసం రుణం తీసుకున్న వారు 42 శాతం మంది ఉన్నారు.  
 
ఇంటర్నెట్‌ సౌలభ్యం అందుతున్న ప్రజల విషయానికి వస్తే,  బిహార్,  జార్ఖండ్‌లు వరుసగా 24 శాతం, 29 శాతంతో చివరి స్థానంలో ఉన్నాయి. కాగా  పాట్నా, రాంచీలలో మొబైల్‌ ఫోన్ల వినియోగం పరంగా డిజిటల్‌ అక్షరాస్యత వరుసగా 64 శాతం మరియు 65 శాతంగా నమోదైంది.

చదవండి: దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం!

Advertisement
 
Advertisement