ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కొత్త సాంకేతికతలతో దూసుకుపోతున్న ఆంత్రోపిక్ వరుస భద్రతా లోపాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వారం వ్యవధిలోనే రెండోసారి అంతర్గత కోడింగ్ సమాచారం లీక్ అవ్వడం టెక్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. తాజాగా కంపెనీకి చెందిన అత్యంత కీలకమైన కోడింగ్ సాధనం ‘క్లాడ్ కోడ్’కు సంబంధించిన సోర్స్ కోడ్ లీక్ అయినట్లు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది.
ఏం జరిగింది?
ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, ఈ తాజా సంఘటనలో క్లాడ్ కోడ్‌కు అనుసంధానించిన దాదాపు 1,900 ఫైళ్లలో 5,00,000 లైన్ల కోడ్ లీక్ అయింది. సాఫ్ట్‌వేర్ ప్యాకేజింగ్, డెప్లాయిమెంట్ సమయంలో జరిగిన సాంకేతిక లోపం వల్ల ఈ డేటా బయటకు వచ్చింది. గత వారమే కంపెనీకి చెందిన ‘మైథోస్’ అనే రహస్య ఏఐ మోడల్ వివరాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కోడింగ్ టూల్ సోర్స్ కోడ్ బయటకు రావడం కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. అయితే, ఈ లీక్ వల్ల కస్టమర్ డేటా లేదా గోప్యమైన క్రెడెన్షియల్స్ ఏవీ బహిర్గతం కాలేదని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది.
లీక్ అయిన కోడ్ ప్రాముఖ్యత
లీకైన ఫైళ్లలో ‘ఏజెంటిక్ హార్నెస్’ అని పిలవబడే కీలకమైన సాఫ్ట్‌వేర్ లేయర్ భాగాలు ఉన్నాయి. ఇది ఏఐ మోడల్ ఇతర సిస్టమ్‌లతో, టూల్స్‌తో ఎలా అనుసంధానం చెందాలో, భద్రతా విధానాలను ఎలా అమలు చేయాలో నియంత్రిస్తుంది. ఎంటర్‌ప్రైజ్ క్లయింట్లు ఉపయోగించే ఈ టూల్ అంతర్గత నిర్మాణం బయటపడటం ఆందోళన కలిగించే అంశం.
లోపం ఎక్కడ జరిగింది?
ఈ ఘటన వెనుక ఎటువంటి సైబర్ దాడి లేదని, ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమేనని ఆంత్రోపిక్ పేర్కొంది. డెవలపర్ ప్లాట్‌ఫారమ్‌కు ‘కంపైల్డ్ వెర్షన్’ అప్‌లోడ్ చేయాల్సి ఉండగా పొరపాటున ఫుల్ సోర్స్ ప్యాకేజీని అప్‌లోడ్ చేయడం వల్ల ఇలా జరిగిందని తెలిపింది. దీనివల్ల సాధారణంగా కంపెనీ పరిధిలోనే ఉండాల్సిన అంతర్గత కోడ్, పబ్లిక్ యాక్సెస్‌లోకి వెళ్లిపోయింది.
భద్రత సవాళ్లు
కోర్ ఏఐ మోడల్ లీక్ కానప్పటికీ దాని పరిధిలోని సిస్టమ్ డిజైన్ బయటపడటం వల్ల ప్రమాదం పొంచి ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు ఈ కోడ్‌ను అధ్యయనం చేయడం ద్వారా ఆంత్రోపిక్ సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ను అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఏపీఐ డెవలప్‌మెంట్ తీరు తెలిస్తే హ్యాకర్లు లేదా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఆ రక్షణ లేయర్లను సులువుగా దాటవచ్చు.
‘ఏఐ సిస్టమ్స్ మరింత శక్తివంతంగా మారుతున్న తరుణంలో వాటి భద్రతపై కఠినమైన నిఘా అవసరమని ఈ ఘటన గుర్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నా’ అని ఆంత్రోపిక్ ప్రతినిధి తెలిపారు.
ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?


