అమ్మో.. అపార్ట్‌మెంట్‌!! | Amenities Charges Burden on Home Buyers in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో గృహ కొనుగోలుదారులపై వసతుల భారం

May 12 2025 1:20 PM | Updated on May 12 2025 1:35 PM

Amenities Charges Burden on Home Buyers in Hyderabad

వాడినా, వాడకున్నా అమినిటీస్‌ చార్జీలు కట్టాల్సిందే..

అపార్ట్‌మెంట్లలో 20–25 శాతం వరకు వసతుల బాదుడు

స్క్వాష్‌ కోర్ట్, క్లబ్‌హౌస్, టేబుల్‌ టెన్నిస్‌.. అన్నింటికీ వసూళ్లే..

ఓపెన్‌ ప్లాట్‌లోనూ.. వసతులు కల్పిస్తామని మాయమాటలు

వీకెండ్‌ రిసార్ట్, క్లబ్‌హౌస్‌ సభ్యత్వం అంటూ రూ.లక్షల్లో చార్జీలు

ఓసీ రాకముందు వసూలు చేయవద్దనే నిబంధనలు

నివాసితులకు భారంగా మారిన క్లబ్‌హౌస్‌ల నిర్వహణ

పదేళ్ల క్రితం కాప్రాలో అపార్ట్‌మెంట్‌ కొన్న.. చ.అ.కు రూ.3 వేల చొప్పున 1,100 చ.అ.లకు రూ.33 లక్షలు అయ్యింది. ఆ సమయంలో కార్పస్‌ ఫండ్, వసతుల నిర్వహణ కోసమని రూ.5 లక్షలు వసూలు చేశారు. ప్రతి నెలా అపార్ట్‌మెంట్‌ నిర్వహణ ఖర్చు కోసం నెలకు రూ.2 వేలు చెల్లిస్తున్నా. అయితే ప్రస్తుతం వ్యక్తిగత అవసరాల కోసం ఆ ఫ్లాట్‌ను అమ్మేద్దామని నిర్ణయించుకున్నా. కొనడానికి ఎవరొచ్చినా సరే అపార్ట్‌మెంట్‌ ధరనే లెక్కిస్తున్నారే తప్ప.. నేను చెల్లించిన కార్పస్‌ ఫండ్‌ పరిగణలోకి తీసుకోవటం లేదు. 
– ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఇదీ..

నగరంలోని ఓ ఐటీ కంపెనీలో హెడ్‌గా పనిచేశాను. స్విమ్మింగ్‌ పూల్, జిమ్, పిల్లలకు ప్లే ఏరియా వంటివి ఉన్నాయని కూకట్‌పల్లిలో ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో రూ.80 లక్షలకు ఫ్లాట్‌ కొన్నా. వీటి కోసం డెవలపర్‌కు అదనంగా రూ.10 లక్షలు చెల్లించాను. అందులో ఉన్నంత వరకూ బాగానే ఉంది. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగళూరుకు బదిలీ అయ్యింది. ఎప్పుడైతే సొసైటీకి అపార్ట్‌మెంట్‌ అప్పగించారో రెండేళ్ల తర్వాత సరైన నిర్వహణ లేక స్విమ్మింగ్‌ పూల్‌ పాడైపోయింది. జిమ్‌లోని వస్తువులు 
మూలనపడ్డాయి. 
– ఓ ఐటీ ఉద్యోగి వ్యథ ఇదీ..

...వీళ్లిద్దరే కాదు గృహ కొనుగోలుదారుల అందరిపైనా వసతుల భారం పడుతుంది. సామాన్యుడి సొంతింటి కలకు నిర్మాణ వ్యయం, స్థలాల ధరలు ఎంత భారం అవుతున్నాయో.. అదే స్థాయిలో వసతుల చార్జీలు భారంగా మారిపోయాయి. క్లబ్‌హౌస్, పార్కింగ్, సెలబ్రిటీ జిమ్, స్విమ్మింగ్‌ పూల్, స్క్వాష్‌ కోర్ట్, టేబుల్‌ టెన్నిస్, క్రికెట్‌ పిచ్, బ్యాడ్మింటన్‌ కోర్ట్, ఇండోర్‌ గేమ్స్, చిల్డ్రన్‌ పార్క్, జాగింగ్‌ అండ్‌ వాకింగ్‌ ట్రాక్స్, యోగా, మెడిటేషన్‌ హాల్, గెస్ట్‌ రూమ్స్, 7 స్టార్‌ రెస్టారెంట్‌.. ఇలా బోలెడన్నీ వసతులను ప్రకటిస్తున్నారు. అన్నింటికీ రూ.లక్షల్లోనే చార్జీలను వసూలు చేస్తున్నారు. రెరా నిబంధనల ప్రకారం అపార్ట్‌మెంట్‌ ధరలోనే వసతుల చార్జీలు కలిపి ఉండాలి. కానీ, నిర్మాణ సంస్థలు వేర్వేరుగా వసూలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాయింట్స్, గ్రీనరీ, పైప్‌డ్‌ గ్యాస్, విద్యుత్, తాగునీరు ఇలా కనీస మౌలిక వసతులకు రూ.లక్షలలో వసూలు చేస్తున్నారు. రెండేళ్ల పాటు క్లబ్‌హౌస్‌ నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రకటిస్తూనే.. మరోవైపు సభ్వత్య రుసుము రూ.2–3 లక్షల వరకూ బాదుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో


ఓసీ రాకముందే వసూళ్లు.. 
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(ఓసీ) రాకముందు వసతుల ఏర్పాటు, నిర్వహణకు చార్జీలు వసూలు చేయకూడదనేది నిబంధన. కానీ, నిర్మాణ సంస్థలు పట్టించుకోవటం లేదు. పోనీ, ఆయా ప్రభుత్వ విభాగాలైనే నియంత్రిస్తున్నాయా అంటే పట్టించుకునే నాథుడే లేడు. మౌలిక వసతులను కల్పించిన తర్వాతే మున్సిపల్‌ విభాగం ఓసీని విడుదల చేయాల్సి ఉంటుంది. స్విమ్మింగ్‌ పూల్, జిమ్, ఇండోర్‌ గేమ్స్, జాగింగ్, వాకింగ్‌ ట్రాక్స్‌.. అంటూ కొనుగోలుదారుడికి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వసతులను కల్పించాడా లేదా అని పర్యవేక్షించే వారే కరువయ్యారు. కానీ, భౌతికంగా ఆయా వసతులను డెవలపర్‌ కల్పించాడా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారే లేరు. ఒక్కసారి ఓసీ రిలీజ్‌ అయ్యాక ఇక ఆ అపార్ట్‌మెంట్‌కు డెవలపర్‌కు సంబంధం ఉండదు.


👉ఇది చదివారా? వీకెండ్‌ ఇల్లు.. రూ.10 కోట్లయినా పర్లేదు..!


వెంచర్లలో రిసార్ట్‌ అని వసూళ్లు.. 
ఓపెన్‌ ప్లాట్లు చేసే బిల్డర్లు కూడా మీము ఏం తక్కువ తిన్నామా అన్నట్లు అపార్ట్‌మెంట్లలో కల్పించే వసతులను వెంచర్లలో కూడా కల్పిస్తామని మాయమాటలు చెబుతున్నారు. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం వెంచర్లలో రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్‌ వ్యవస్థ వంటివి కల్పించాల్సిన బాధ్యత డెవలపర్లదే.. కానీ, బిల్డర్లు వీటికి కూడా వసతుల ఏర్పాటు పేరిట చార్జీలు వసూలు చేస్తున్నారు. వీకెండ్‌ రిసార్ట్, ఫార్మింగ్, గోల్ఫ్‌ కోర్స్, క్లబ్‌హౌస్‌ సభ్యత్వం అని రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. శామీర్‌పేట, షాద్‌నగర్, తుక్కుగూడ, యాదాద్రి, చేవెళ్ల, శ్రీశైలం జాతీయ రహదారి వంటి పలు ప్రాంతాల్లోని వెంచర్లలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని తెగ ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.

🔶ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఓ నిర్మాణ సంస్థ అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. ఇందులో ధర చదరపు అడుగు(చ.అ.) రూ.9 వేలకు విక్రయిస్తుంది. 2,050 చ.అ.అపార్ట్‌మెంట్‌కు రూ.1,84,50,000 అవుతుంది. ఇక, ఈ అపార్ట్‌మెంట్‌లో వసతుల చార్జీలు కింది పట్టికలో చూద్దాం!

అపార్ట్‌మెంట్‌కు రూ.1,84,50,000 అయితే, వసతులకు చెల్లించాల్సింది రూ.2,92,22,468. వసతులు, అపార్ట్‌మెంట్‌ ధర రెండూ కలిపితే రూ.2,13,72,468 అయ్యిందన్నమాట.

ఇలా చేస్తే బెటర్‌.. 
🔹    వసతుల కల్పనకు అయ్యే వ్యయాన్ని కొనుగోలుదారుల నుంచి వసూలు చేయడం సరైంది కాదు. నిర్మాణ సంస్థలు కల్పించే వసతులతో సగానికి పైగా అమినిటీస్‌ నివాసితులు వినియోగించరు. పైగా ప్రతినెలా నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో గేటెడ్‌ కమ్యూనిటీల్లోని నివాసితులకు అపార్ట్‌మెంట్‌ కొనుగోలు భారంగా మారుతుంది. నిర్మాణం పూర్తయ్యాక ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా రెండేళ్ల పాటు వసతుల నిర్వహణ నిర్మాణ సంస్థే చేయాలి. 
🔹    ప్రాజెక్ట్‌లో విక్రయాలు పూర్తయ్యాక డెవలపర్‌ కమ్యూనిటీని హౌసింగ్‌ సొసైటీకి అప్పగిస్తారు. అక్కడి నుంచి అందులోని వసతులను నివాసితులే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మొదట్లో బాగానే ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ ఆయా వసతుల నిర్వహణ పట్టించుకునే వారే ఉండరు. స్విమ్మింగ్‌ పూల్‌ ఎండిపోతుంది. నిర్వహణ లేక జిమ్, ఇతర వసతులు మూలనపడిపోతాయి. 
🔹    అపార్ట్‌మెంట్‌ నిర్వహణ ఖర్చులు చ.అ.ల చొప్పున కాకుండా నివాసితుందరికీ ఒకటే విధంగా ఉండాలి. పెద్ద సైజు గృహాలకు ఎక్కువ రహదారి, డ్రైనేజీ ఎక్కువ నీళ్లు, ఎక్కువ కాంతి వాడుకోలేరు కదా. అందుకే ఎన్ని ఫ్లాట్ల సంఖ్యను బట్టి చార్జీలను విభజించాలి. 
🔹    హౌసింగ్‌ సొసైటీల్లోని క్లబ్‌హౌస్‌లను థర్డ్‌ పార్టీకి అప్పగించాలి. రెస్టారెంట్, సూపర్‌మార్కెట్, మెడికల్‌ వంటి ఇతరత్రా వాటికి అప్పగించాలి. ఆ అద్దెతో కమ్యూనిటీలో ఇతరత్రా ఖర్చులను వినియోగించుకోవచ్చు. 
🔹    ఒకటే ఏరియాలో ఉండే 3–4 ప్రాజెక్ట్‌లకు ఒకటే క్లబ్‌హౌస్‌ కట్టుకోవటం ఉత్తమం. దీంతో నిర్మాణ సంస్థకు ఖర్చు ఆదా అవటంతో పాటు నివాసితులకు నిర్వహణ భారం కాదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement