
ముంబై: లిస్టెడ్ కంపెనీలు చేపట్టే విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఏ) లావాదేవీలకు కూడా నిధులు సమకూర్చడంపై బ్యాంకులు దృష్టి పెడుతున్నాయి. దీనికి అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంకును దేశీ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) సూత్రప్రాయంగా అభ్యర్తించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి ఈ విషయం తెలిపారు.
వినియోగాన్ని పెంచేందుకు ఓవైపు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో మరోపక్క ప్రయివేట్ రంగం సైతం సామర్థ్య విస్తరణపై పెట్టుబడులకు ఉపక్రమించాలని సూచించారు. సాధారణంగా బలవంతపు టేకోవర్లకు తోడ్పడకూడదనే ఉద్దేశమే, ఎంఅండ్‌ఏ ఫండింగ్‌కి బ్యాంకులను దూరంగా ఉంచడానికి కారణమని పేర్కొన్నారు.
అయితే.. అత్యంత పారదర్శకంగా, వాటాదారుల అనుమతితో లిస్టెడ్ కంపెనీలు చేపట్టే కొనుగోళ్లకైనా నిధులు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ ఆర్‌బీఐకు విన్నవించనున్నట్లు తెలియజేశారు. దీనితో బలవంతపు టేకోవర్లకు ఫండింగ్ చేసే సందర్భాలు తగ్గుతాయని పేర్కొన్నారు. భారత వాణిజ్య సమాఖ్య, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన 2025 ఎఫ్‌ఐబీఏసీ సందర్భంగా శెట్టి పలు అంశాలపై స్పందించారు.
పెట్టుబడి వ్యయాలు ఇలా..
దేశీ కార్పొరేట్ రంగం అంతర్గత వనరులు, ఈక్విటీ, రుణ మార్కెట్ల ద్వారా ప్రస్తుతం పెట్టుబడి వ్యయాలను సమకూర్చుకుంటున్నట్లు ఎస్‌బీఐ చీఫ్ శెట్టి తెలియజేశారు. ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగం పుంజుకోనుందన్న అంచనాలతో కంపెనీలు సామర్థ్య విస్తరణపై పెట్టుబడులు చేపట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే నిలకడైన డిమాండ్ వాతావరణం కనిపించినప్పుడు మాత్రమే పెట్టుబడి వ్యయాలు పుంజుకుంటాయని అత్యధికులు చెబుతున్నట్లు ప్రస్తావించారు.
జీఎస్‌టీ రేట్లలో వ్యవస్థాగత సంస్కరణలు, రూ. 12 లక్షల వరకూ ఆదాయ పన్ను మినహాయింపులు తదితర పలు చర్యలకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి డిమాండ్ మళ్లీ భారీస్థాయిలో పుంజుకుంటే కార్పొరేట్లకు పెట్టుబడి వ్యయాలు లేదా తగిన ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో లేకపోవచ్చని వ్యాఖ్యానించారు. సామర్థ్య విస్తరణవైపు కంపెనీలు ఇప్పటికిప్పుడు దృష్టి పెడితే అటు క్యాపిటల్ మార్కెట్లు, ఇటు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా రుణ మార్కెట్లు కచ్చితంగా మద్దతిస్తాయని వివరించారు.
కస్టమర్ సర్వీసుల పెంపు, సైబర్ సెక్యూరిటీ పటిష్టత, మరింత ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు దేశీ బ్యాంకింగ్ రంగం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల(ఎంఎస్‌ఎంఈలు)కు రుణాలందించడంపై ఇటీవల బ్యాంకులు అత్యధికంగా దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ - జూన్(క్యూ1)లో వీటికి 19 శాతం అధికంగా రూ. 5.28 లక్షల కోట్ల రుణాలందించినట్లు వెల్లడించారు.