ఏఐతో హైరింగ్‌ ధోరణుల్లో మార్పులు | AI Disruption Reshapes Hiring Trends TeamLease Digital CEO Neeti Sharma | Sakshi
Sakshi News home page

ఏఐతో హైరింగ్‌ ధోరణుల్లో మార్పులు

Apr 7 2026 7:28 AM | Updated on Apr 7 2026 8:38 AM

AI Disruption Reshapes Hiring Trends TeamLease Digital CEO Neeti Sharma

భారీ స్థాయిలో తగ్గుతున్న సిబ్బంది అవసరం

కృత్రిమ మేథతో పెరుగుతున్న ఉత్పాదకత

కొద్ది మంది సిబ్బందితోనే పెద్ద ఎత్తున పనులు పూర్తి

టీమ్‌లీజ్‌ డిజిటల్‌ సీఈవో నీతి శర్మ  

కృత్రిమ మేథ (ఏఐ)తో నియామకాల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వస్తున్నాయని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ సీఈవో నీతి శర్మ తెలిపారు. దీని వల్ల ఉద్యోగుల తొలగింపు అనేది ఆర్థికాంశాలతో కన్నా ఎక్కువగా టెక్నాలజీతో ముడిపడి ఉన్న వ్యవహారమని పేర్కొన్నారు. ఏఐతో ఉత్పాదకత పెరుగుతుండటంతో కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం తగ్గుతోందన్నారు. తక్కువ మంది సిబ్బందితోనే విస్తృతంగా కార్యకలాపాలని నిర్వహించుకోవడంపై అవి దృష్టి పెడుతున్నాయని శర్మ వివరించారు.

అంతేగాకుండా కోవిడ్‌ సమయంలో భారీ స్థాయిలో నియమించుకున్న ఉద్యోగులను కంపెనీలు ప్రస్తుతం వ్యాపార అవసరాలకు అనుగుణంగా తగ్గించుకుంటూ ఉండటం కూడా ఉద్వాసనలకు కారణమవుతోందని తెలిపారు. ఈ అంశాలన్నీ కలిసి ఉద్యోగుల్లో అభద్రత భావన పెరుగుతోందని, 60 శాతం మంది పైగా టెక్‌ వర్కర్లలో స్థిరత్వంపై ఆందోళన నెలకొందని తెలిపారు. గత కొన్నాళ్లుగా టెక్నాలజీ రంగంలో నిర్దాక్షిణ్యంగా కోతలు అమలవుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రాకింగ్‌ సైట్‌ లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు అంతర్జాతీయంగా 70 పైగా టెక్‌ కంపెనీలు ఏకంగా 40,480 మంది ఉద్యోగులను తొలగించాయి.  

ఉత్పాదకత 30 శాతం వరకు అప్‌..

ఏఐతో కోడింగ్, సపోర్ట్‌లాంటి కార్యకలాపాల్లో ఉత్పాదకత 10–30 శాతం వరకు పెరిగిందని నీతి శర్మ చెప్పారు. ప్రొడక్టివిటీ కస్టమర్‌ సపోర్ట్‌లో 14–15 శాతం, కోడింగ్, టాస్క్‌ల రైటింగ్‌లాంటి కొన్ని విధుల్లో 40 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. దీనితో ఇలాంటి పనుల కోసం పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉండటం లేదని,  తక్కువ మంది ఉద్యోగులు సరిపోతున్నారని వివరించారు. లేఆఫ్‌లతో మిగిలే నిధులను సంస్థలు టెక్నాలజీపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాయని చెప్పారు. స్వల్పకాలికంగా రాబడులపై అనిశ్చితి నెలకొన్నా దీర్ఘకాలికంగా ఉపయోగపడే సామర్థ్యాలను పెంచుకోవడం వైపు మళ్లే విధంగా వ్యవస్థాగతంగా వస్తున్న మార్పులను ఇది సూచిస్తోందన్నారు.  బడా టెక్‌ కంపెనీలు సైతం బ్యాలెన్స్‌ షీట్స్‌ పటిష్టంగా ఉన్నప్పటికీ ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, చాలా కంపెనీలు ఏఐని వినియోగించుకోవడంలో ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని వివరించారు.  

నిపుణులకే డిమాండ్‌..

ఏఐ వల్ల రొటీన్‌ ఉద్యోగాలకు ప్రాధాన్యత తగ్గుతోందని, విశిష్ట నైపుణ్యాలున్న వారికి డిమాండ్‌ పెరుగుతోందని శర్మ చెప్పారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ)లో ఏఐ, డేటా, సైబర్‌ సెక్యూరిటీ నియామకాలు వార్షికంగా 18–27 శాతం పెరుగుతుండగా, ఐటీ సరీ్వసుల విభాగంలో 4–6 శాతం వృద్ధి ఉంటోందని తెలిపారు. అదే సమయంలో నిపుణుల కొరత 25–60 శాతం మేర ఉంటోందన్నారు. దీని వల్ల వేతన వృద్ధి 10–12 శాతం ఉంటోందని శర్మ వివరించారు. సీనియర్‌ హోదాలకు రూ. 60 లక్షల వరకు ప్రీమియం స్థాయిలో వేతనాలు ఉంటున్నాయన్నారు. అత్యధిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత ఉద్యోగాల వైపు పరిశ్రమ మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోందని శర్మ తెలిపారు.

ఏఐ వల్ల ఉద్యోగ విధుల స్వరూపం మారుతోందని, ఇందుకోసం కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెట్టడం కీలకమని ఆమె చెప్పారు. అధికారికంగా శిక్షణ పొందుతున్న ఉద్యోగుల సంఖ్య పాతిక శాతం లోపే ఉంటోందన్నారు. కాబట్టి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణనివ్వడం, అంతర్గతంగా వేరే వేరే విభాగాల్లోకి మారే వెసులుబాట్లు కల్పించడంపై కంపెనీలు ఇన్వెస్ట్‌ చేయాలని, విధాన నిర్ణేతలు కూడా భారీ స్థాయి శిక్షణ కార్యక్రమాలకు ప్రోత్సాహకాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని శర్మ చెప్పారు. ఇక ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను సంతరించుకోవడానికి ప్రాధాన్యమిచ్చే ఆలోచనా ధోరణితో ముందుకెళ్లాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఇరాన్‌తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement