విప్రో రూ. 9,300 కోట్ల డీల్‌ | Wipro to acquire Olam Group IT and digital services | Sakshi
Sakshi News home page

విప్రో రూ. 9,300 కోట్ల డీల్‌

Apr 7 2026 5:25 AM | Updated on Apr 7 2026 7:08 AM

Wipro to acquire Olam Group IT and digital services

ఓలమ్‌ గ్రూప్‌ నుంచి కాంట్రాక్ట్‌ 

మైండ్‌స్ప్రింట్‌ కొనుగోలుకి రెడీ

న్యూఢిల్లీ/సింగపూర్‌: ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా ఫుడ్, అగ్రి బిజినెస్‌ల సింగపూర్‌ దిగ్గజం ఓలమ్‌ గ్రూప్‌తో భారీ డీల్‌ కుదుర్చుకుంది. 8 ఏళ్లపాటు అమల్లో ఉండే ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కాంట్రాక్టు విలువ బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 9,300 కోట్లు)కాగా.. దీనిలో భాగంగా ఓలమ్‌ గ్రూప్‌నకు చెందిన ఐటీ, డిజిటల్‌ సర్వీసుల విభాగం మైండ్‌స్ప్రింట్‌ పీటీఈను కొనుగోలు చేయనుంది. ఇందుకు 37.5 కోట్ల డాలర్లు(రూ. 3,494 కోట్లు) వెచ్చించనున్నట్లు విప్రో వెల్లడించింది. 

పీఈ దిగ్గజం టెమాసెక్‌ మెజారిటీ వాటా కలిగిన ఓలమ్‌ గ్రూప్‌ 50 బిలియన్‌ డాలర్లకుపైగా ఆదాయంతోపాటు 40,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నట్లు్ల పేర్కొంది. సింగపూర్‌ కేంద్రంగా 2007లో ఏర్పాటైన మైండ్‌స్ప్రింట్‌కు భారత్‌సహా.. సింగపూర్, యూఎస్, యూకే, పశ్చిమాసియాలో 3,200 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 2025 కేలండర్‌ ఏడాదిలో 13.56 కోట్ల డాలర్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయం అందుకుంది. ఓలమ్‌ గ్రూప్‌తో కుదుర్చుకున్న వ్యూహాత్మక డీల్‌లో భాగంగా ఎండ్‌ టు ఎండ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సర్వీసులను అందించనున్నట్లు విప్రో తెలియజేసింది.

 ఏఐ ఆధారిత కన్సల్టింగ్‌ సేవలు సమకూర్చనున్నట్లు పేర్కొంది. పూర్తి నగదురూపేణా 2026 జూన్‌ 30కల్లా మైండ్‌స్ప్రింట్‌లో 100 శాతం వాటా కొనుగోలు చేసే వీలున్నట్లు వెల్లడించింది. ఐపీ ఆధారిత సొల్యూషన్లలో మైండ్‌స్ప్రింట్‌కున్న డొమైన్‌ నైపుణ్యాలకు ఏఐతోకూడిన విప్రో కన్సల్టింగ్‌ ఆధారిత సామర్థ్యాలు జత కలవనున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం విప్రోకు పూర్తి అనుబంధ కంపెనీగా మైండ్‌స్ప్రింట్‌ అవతరించనుంది. అయితే సంస్థ ప్రస్తుత సీఈవో సురేష్‌ సుందరరాజన్‌ బాధ్యతలను కొనసాగించనున్నారు. 
బీఎస్‌ఈలో విప్రో షేరు 1.25% బలపడి రూ. 197 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement