'ఒరాకిల్‌'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా? | Laid Off but Not Worried Oracle Techie Finds Stability Driving Uber | Sakshi
Sakshi News home page

'ఒరాకిల్‌'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?

Apr 6 2026 9:22 PM | Updated on Apr 6 2026 9:33 PM

Laid Off but Not Worried Oracle Techie Finds Stability Driving Uber

ఓ సంస్థలో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. చాలామంది ఉద్యోగులు భయపడతారు, బాధపడతారు. కానీ ఒరాకిల్ కంపెనీ తొలగించిన ఒక ఉద్యోగి మాత్రం ఇందుకు భిన్నం. ఉబెర్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నా సన్నిహితులలో ఒకరిని ఒరాకిల్ బెంగళూరు సంస్థ.. ఉద్యోగం నుంచి తొలగించింది. అతడు ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి లోను కాకపోవడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఆ విషయాలను వెల్లడించలేదు. జాబ్ కోల్పోయిన తరువాత వెంటనే తన సొంత ఊరైన భువనేశ్వర్‌కు తిరిగి వచ్చేశాడు.

అయితే.. అతనికి రెండు జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి. వాటిలో.. ఒక్కొక్కదానిలో రూ.15 లక్షల చొప్పున పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకున్నాడు. ఒకటి అతని తల్లిదండ్రుల పేరు మీద, మరొకటి అతని, అతని భార్య పేరు మీద ఉంది. అతని పిల్లల ఖాతాలో కూడా ఒకటి ఉంది. వీటన్నింటి ద్వారా అతనికి ప్రతి నెలా దాదాపు రూ.28,000 వడ్డీ వస్తుంది.

పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కాకుండా.. అతనికి కొన్ని బ్యాంకులలో దాదాపు రూ.30 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి, వీటి ద్వారా అతనికి నెలకు మరో రూ.15,000 వస్తుంది. అతను ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. అతనికి డ్రైవింగ్ వచ్చు, కాబట్టి అతను వెంటనే తనకు వీలైనప్పుడు ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ మంచి సంపాదన పొందుతున్నాడు.

ఇదీ చదవండి: ఆ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే.. పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే!

అతనికి ఈఎంఐలు లేవు, ఏ మెట్రో నగర ఫ్లాట్‌కు లోన్స్ లేవు. అదే సమయంలో, అతను తన తల్లిదండ్రుల సహాయంతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రశాంతంగా ప్రణాళిక వేస్తున్నాడు. ఆయన ఎప్పుడూ ఇన్‌ఫ్లుయెన్సర్లను అనుసరించలేదు, SIPలు చేయలేదు, ఆర్థిక హడావుడికలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా పాత పద్ధతుల మనస్తత్వం, స్థిరమైన ప్రక్రియ, క్రమశిక్షణ.

కాబట్టి.. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. జాబ్ ఉన్నా.. లేకున్నా మీ ఆర్ధిక క్రమ శిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో సిద్ధంగా ఉండటమే నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం అని నాయక్ సత్య అనే ట్విటర్ యూజర్ ఈ విషయాలు షేర్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement