అదానీ గ్రూప్‌ ఎఫ్‌పీవో సక్సెస్‌ అవుతుంది : జుగేశిందర్‌ సింగ్‌

Adani Group Stocks Key To Rs 20,000 Crore Fpo Success - Sakshi

న్యూఢిల్లీ: గత వారం ప్రారంభమైన ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఎఫ్‌పీవో) విజయవంతమవుతుందని డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సీఎఫ్‌వో జుగేశిందర్‌ సింగ్‌ తాజాగా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎఫ్‌పీవో ధరలో లేదా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేపట్టబోమని తెలియజేశారు. యూఎస్‌ షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రభావంతో గత వారం చివర్లో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే.

అయితే రూ. 20,000 కోట్ల సమీకరణకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ చేపట్టిన ఎఫ్‌పీవో శుక్రవారమే(27న) ప్రారంభమైంది. ఇష్యూ మంగళవారం(ఫిబ్రవరి 1న) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీవో ధర లేదా షెడ్యూల్‌ను సవరించే యోచనలేదంటూ సీఎఫ్‌వో స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీల కౌంటర్లు అమ్మకాలతో డీలా పడ్డాయి. షేర్ల ధరల్లో పెరుగుదల, ఖాతాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపించింది. 

ఈ ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కోనున్నట్లు ఇప్పటికే అదానీ గ్రూప్‌ తెలియజేసింది. హిండెన్‌బర్గ్‌ ఎలాంటి రీసెర్చ్‌ చేయకుండానే అదానీ గ్రూప్‌పై ఆరోపణలు గుప్పించినట్లు సింగ్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ నివేదికలో ఎలాంటి పరిశోధనా సంబంధ అంశాలూ లేవని స్పష్టం చేశారు. పూర్తిగా ఆధారరహిత ఆరోపణలు చేసినట్లు వివరించారు.  

సక్సెస్‌ ఎందుకంటే 
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవో ధరల శ్రేణి రూ. 3,112–3,276. మార్కెట్ల పతనంతో వారాంతాన షేరు రూ. 2,762 వద్ద ముగిసింది. అయినప్పటికీ ఎఫ్‌పీవో సక్సెస్‌ కాగలదంటూ ఎఫ్‌పీవో సింగ్‌ పేర్కొన్నారు. ఇందుకు కారణాలు ఇలా వివరించారు. బ్యాంకర్లు, ఇన్వెస్టర్లుసహా వాటాదారులంతా ఎఫ్‌పీవోపై విశ్వాసంతో ఉన్నారు. గత బుధవారం కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే. 

ఓపెన్‌ మార్కెట్లో షేరు తక్కువ ధరకు చేరినప్పటికీ తగినన్ని షేర్లు(ఫ్రీఫ్లోట్‌) అందుబాటులో లేవు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు మాత్రమే తగిన మోతాదులో లభించే వీలుంది. వ్యూహాత్మక పెట్టుబడిదారులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు ఎఫ్‌పీవో ద్వారా తగిన పరిమాణంలో షేర్లు అందుబాటులోకి వస్తాయి. లిక్విడిటీతోపాటు ఫ్రీఫ్లోట్‌ను పెంచేందుకే ఎఫ్‌పీవోకు తెరతీశారు. నిజానికి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు విలువరీత్యా కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసేందకు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ పలు రంగాల సంస్థలకు చేయూత(ఇన్‌క్యుబేటర్‌)గా నిలుస్తోంది. 

ఎయిర్‌పోర్టులు, రహదారులు, నూతన ఇంధన ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, మైనింగ్‌ బిజినెస్‌ తదితరాలను నిర్వహిస్తోంది. వీటితోపాటు హైడ్రోజన్‌ తదితర ఆధునిక బిజినెస్‌లలో విస్తరిస్తోంది. ఇందుకు రానున్న దశాబ్ద కాలంలో 50 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనుంది. 2025–2028 మధ్య కాలంలో బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే ప్రణాళికలకు సైతం తెరతీసింది. వెరసి షేరు ధరలో తాత్కాలిక ఆటుపోట్లవల్ల కంపెనీ దీర్ఘకాలిక విలువలో మార్పులు సంభవించబోవంటూ సింగ్‌ స్పష్టం చేశారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top